మోడీని కలిసే ముందు.. కలిసిన తర్వాతా రేవంత్ టార్గెట్ కిషన్ రెడ్డే!
ఈ సందర్బంగా పలు అంశాల్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటల్ని.. చేసిన వ్యాఖ్యల్ని.. విమర్శలు చేసిన వారిని చూసినప్పుడు ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తనలోని వైవిధ్యాన్ని ఢిల్లీ వేదికగా ప్రదర్శించారని చెప్పాలి. దాదాపు గంటకు పైగా ప్రధాని నరేంద్ర మోడీతో ముఖాముఖి భేటీ అనంతరం ఆయన.. మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్బంగా పలు అంశాల్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటల్ని.. చేసిన వ్యాఖ్యల్ని.. విమర్శలు చేసిన వారిని చూసినప్పుడు ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. ప్రధాని మోడీతో భేటీకి ముందు.. అంటే రెండు రోజుల ముందు నుంచి రేవంత్ నోటి నుంచి వచ్చిన రాజకీయ విమర్శలు ఎక్కువగా కేంద్ర మంత్రికిషన్ రెడ్డిని ఉద్దేశించి రావటం కనిపిస్తుంది.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ప్రధాని మోడీతో భేటీకి ముందు కిషన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సీఎం రేవంత్.. మోడీతో గంట పాటు మాట్లాడిన కాసేపటికి నిర్వహించిన మీడియా చిట్ చాట్ లోనూ టార్గెట్ కిషన్ రెడ్డి అన్నట్లుగా ఉండటం కనిపిస్తుంది. హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశం కేంద్ర క్యాబినెట్ లో చర్చకు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని.. కేసీఆర్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు.. మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్టు కాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీకి తాను ఇచ్చిన వినతులకు సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాధిస్తే ఆయనకు పౌరసన్మానం చేస్తానంటూ ఆసక్తికర ప్రకటన చేశారు. తెలంగాణ డెవలప్ మెంట్ ను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారంటూ తరచూ విమర్శలు చేస్తున్న రేవంత్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అనంతరం కూడా కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన తీరు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ఫోన్ ట్యాపింగ్. ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన విచారణ విషయంలోనూ కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారన్న విమర్శలు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పక తప్పదు.