వినాయక నిమజ్జనంలో సీఎం రేవంత్ మనవడి డ్యాన్స్ వైరల్!

దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-17 08:03 GMT

దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వినాయక నిమజ్జనానికి హైదరాబాద్ నగరం సిద్ధమైంది. ఇందులో భాగంగా.. మంగళవారం వేలాది విగ్రహాలు గంగమ్మ చెంతకు చేరుకుంటున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది.

ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 25వేల మంది పోలీసులతో భద్రత చర్యలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో... హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిటీ సీపీ సీవీ ఆనంద్ ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా... ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ఏర్పాట్ల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే క్రేన్ డ్రైవర్లు, ఇతర సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మరోపక్క ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం మరికాసేపట్లో జరగనుంది.

ఇప్పటికే ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు మహా గణపతి చేరుకున్నాడు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. "జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై" నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి.

ఆ సంగతి అలా ఉంటే... గణేస్ నిమజ్జన ఊరేగింపులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనవడు రేయాన్స్ రెడ్డి డ్యాన్స్ చేశాడు. తీన్మార్ డప్పుల మోత మోగుతుండగా.. అక్కడున్నవారంతా చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తుండగా.. రేయాన్స్ డ్యాన్స్ తో అదరగొట్టేశాడు. ఈ సందర్భంగా మనవడి డ్యాన్స్ చూసి రేవంత్ మురిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

కాగా... ప్రతీ పండగనూ సీఎం రేవంత్ రెడ్డి తన మనవడు రేయాన్ష్ రెడ్డితో జరుపుకుంటున్న ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల మనవడి హోలీ పండుగ సంబరాలకు సంబంధించిన ఫోటోలూ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సమయంలో తాజాగా వినాయక నిమజ్జనం సందర్భంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సందడి చేస్తుంది.

Tags:    

Similar News