ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఎస్సీ వర్గీకరణ కోసం గత కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణ కోసం కట్టుబడి ఉన్నట్లు ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది.

Update: 2024-12-15 07:32 GMT

ఎస్సీ వర్గీకరణ కోసం గత కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణ కోసం కట్టుబడి ఉన్నట్లు ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. ఇందుకోసం విధివిధానాలను సైతం రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. అయితే.. తాజాగా సీఎం రేవంత్ వర్గీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగపై ఫైర్ అయ్యారు.

హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో గ్లోబల్ మాదిగ డే -2024 కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా ఎస్సీ వర్గీకరణపై పార్టీ వైఖరిని తమ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇప్పటికే వెల్లడించారన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పులో తమ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. వారం రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణపై షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక ఇచ్చే అవకాశాలూ ఉన్నాయని చెప్పారు.

ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా వర్గీకరణ ప్రాసెస్ చేపడుతామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాజకీయ, అధికార నియామకాల్లోనూ మాదిగలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. చరిత్రలో మొదటిసారి ఓయూ వీసీగా మాదిగ వర్గానికి చెందిన వ్యక్తిని అపాయింట్ చేశామని తెలిపారు. ఇదే సమయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణమాదిగపై రేవంత్ పరోక్షంగా సీరియస్ అయ్యారు. గత కొన్నాళ్లుగా తమ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను దుయ్యబట్టారు. ఎస్సీలలో మాదిగ సామాజికవర్గం వెనుకబడి ఉందన్న విషయాన్ని గుర్తించిందే కాంగ్రెస్ అని పేర్కొన్నారు. మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొందరు అంటున్నారని, అసలు మాదిగల గురించి మాట్లాడిందే తాము అని, మాదిగలకు ప్రాధాన్యం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. సుప్రీంకోర్టులో మాదిగల విజయం వెనుక కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నదన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు.

మరికొద్ది రోజుల్లోనే మాదిగలకు ప్రాధాన్యం ఇచ్చే కార్యక్రమాన్ని సైతం ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా రేవంత్ వివరించారు. నివేదిక రాగానే.. అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. సాధ్యమైనంత వేగంగా ఈ నివేదికను అమలు చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. తమది ఎస్సీ అనుకూల ప్రభుత్వమని, ఎస్సీలకు రాజ్యాంగ ఫలాలు అందించాలన్న సంకల్పంతోనే అనేక రూపాల్లో తమ పార్టీ వివిధ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. కశ్నీరు నుంచి కన్యాకుమారి వరకు ఎస్సీలకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.

Tags:    

Similar News