రేవంత్... కేసీఆర్ విషయంలో ఎందుకీ ఫెయిల్యూర్?
తాజాగా ఇందుకు సంబంధించిన ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
ఆసక్తికర రాజకీయాలకు వేదిక అయిన తెలంగాణలో ప్రజా వ్యతిరేకతను సొంతం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం కైవసం చేయించడం, పెద్ద ఎత్తున పోటీలో కూడా సీఎం సీటు సాధించిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి రాజకీయాల్లో చరిత్ర సృష్టించారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ ను ఎదుర్కోవడంలో ఇప్పటికీ ఊహించని రీతిలో ముందుకు సాగట్లేదని, ఇందులో ఆయన మంత్రుల పాత్ర కూడా ఉందనే చర్చ వినిపిస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కొత్త రేషన్ కార్డులతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర భుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా వంటి పథకాల లబ్దిదారులను ఎంపిక చేసేందుకు గ్రామ సభలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పథకాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుండటంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పలువురు అభ్యర్థులు తమ పేర్లు ఎంపిక జాబితాలో లేకపోవడం వంటి అంశాలపై ఆందోళన చెందుతున్నారు. ఇవి మరింత ముదిరి ప్రజా ప్రతినిధులు, అధికారుల నిలదీత వరకు చేరింది. సహజంగానే మీడియా దృష్టిని ఆకర్షించింది.
తెలంగాణలో గ్రామసభలు నిర్వహిస్తున్న చోట్ల పలు చోట్ల నిరసనలు ఎదురయ్యాయని మీడియాలో వార్తలు వచ్చాయి. వరుసగా రెండు రోజులు ఈ వార్తలు మీడియాలో పెద్ద ఎత్తున హైలెట్ అయ్యాయి. అయితే, ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ టూర్లో ఉన్నారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి స్పందన లేకపోవడం, అధికారుల తరఫున ఇచ్చిన కౌంటర్లు సరిపోని తరుణంలో మంత్రి సీతక్క రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా లబ్ధిదారులను గుర్తిస్తుంటే కావాలని బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుందని ఆరోపించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇతర పథకాలు ఇస్తామని ఎ ఒక్క అర్హుడు నష్టపోకుండా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నామని, గ్రామ సభల్లో కూడా దరఖాస్తులు తీసుకుంటున్నామని సీతక్క వివరించారు.
తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రామ సభల్లో గొడవల పై ప్రభుత్వం అలర్ట్ అయింది,
ప్రతిపక్షాలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాయని నిర్దారణకు వచ్చింది. రేషన్ కార్డుల అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి ఉత్తమ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. గ్రామ సభల్లో సమస్యలను తెలుసుకున్న ఉత్తమ్ ప్రతిపక్షాలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులైనవారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని తెలిపిన మంత్రి ఉత్తమ్ ఈ విషయంలో అల్లర్ల విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు.
కాగా, క్షేత్రస్థాయిలో గ్రామ సభల్లో వస్తున్న ఆందోళనలను గమనించిన ప్రభుత్వం ఈ విషయంలో ఆలస్యంగా స్పందించిందని అంటున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు అని మాత్రమే భావించిన ప్రభుత్వం, ఈ విషయంలో కేవలం రాజకీయపరమైన అంశాలనే చూసిందని పేర్కొంటున్నారు. ప్రజల యొక్క ఆకాంక్షకు తగినట్లుగా స్పందించే విషయంలో తదుపరి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నష్ట నివారణ చేయగలిగిందని చెప్తున్నారు. మరోవైపు మంత్రులు సైతం ఒకింత ఆలస్యంగానే రెస్పాండ్ అయ్యారని అంటున్నారు. కేసీఆర్‌ను ఎదుర్కునే విషయంలో రేవంత్ సర్కారు మరింత దూకుడుగా స్పందిస్తే బాగుండేదనే భావన వ్యక్తం ఆ పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తం అవుతోంది.