మోడీ చేతికి రేవంత్ వినతిపత్రం.. ఊహించని రియాక్షన్ తెలిస్తే అవాక్కే!
తాజాగా అలానే జరిగి ఉంటే.. ఇప్పుడు ఇంత ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. రోటీన్ .. రొడ్డుకొట్టుడు సీన్ కు భిన్నమైన సన్నివేశం తాజా భేటీలో ఆవిష్క్రతమైంది.
ఏ మాత్రం కొత్తదనం ఉండని.. రోటీన్ సీన్ ఒకటి ప్రధానమంత్రిని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసినా కనిపిస్తూ ఉంటుంది. ప్రధానికి చేతికి పుష్పగుచ్ఛం ఇవ్వటం.. శాలువా కప్పటం.. తీసుకొచ్చిన బహుమతిని అందించటం.. పనిలో పనిగా తమ వెంట తెచ్చుకున్న వినతిపత్రాన్ని ఇవ్వటం. దీనికి బదులుగా పరిశీలిస్తామని చెప్పటం.. తాము అడిగిన పనులపై సానుకూలంగా స్పందించారంటూ సదరు ముఖ్యమంత్రి బయటకు వచ్చి మీడియాతో చెప్పటం షరా మామూలుగా జరిగేది.
తాజాగా అలానే జరిగి ఉంటే.. ఇప్పుడు ఇంత ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. రోటీన్ .. రొడ్డుకొట్టుడు సీన్ కు భిన్నమైన సన్నివేశం తాజా భేటీలో ఆవిష్క్రతమైంది. ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కలిసిన సందర్భంగా.. ఆయన ఆరు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధాని మోడీ చేతికి ఇచ్చారు.
అందులో..
1. హైదరాబాద్ మెట్రో రెండో దశ
2. రీజినల్ రింగురోడ్డు దక్షిణభాగం
3. రీజినల్ రింగ్ రైల్వే (హైదరాబాద్ డ్రై పోర్టు కు సంబంధించిన హైవే.. రైల్ కనెక్టివిటీ)
4. సబర్మతి.. గంగా.. యమున మాదిరి మూసీ పునరుద్ధరణ
5. తెలంగాణకు సెమీ కండక్టర్ యూనిట్
6. తెలంగాణకు మరో 29 మంది ఐపీఎస్ ల కేటాయింపు
ఈ అంశాల్ని ప్రధాని నరేంద్ర మోడీతో షేర్ చేసిన వేళలో ఆయన స్పందిస్తూ.. మీరు రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులపై నాకు దరఖాస్తు ఇచ్చారు. తెలంగాణ వద్ద పెండింగ్ లో ఉన్న కేంద్ర పథకాలకు సంబంధించిన దరఖాస్తును మీకు ఇస్తున్నా. వాటిని పరిష్కరించేలా చూడండి’ అంటూ ఆరు అంశాలతో కూడిన దరఖాస్తును సీఎం రేవంత్ చేతిలో పెట్టటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. రెగ్యులర్ గా జరిగే భేటీకి భిన్నంగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
మరి.. సీఎం రేవంత్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పెండింగ్ అంశాలేమిటి? అన్న విషయంలోకి వెళితే..
- 2016-17లో తెలంగాణకు పీఎంఏవై కింద 70,674 ఇళ్లను మంజూరు చేసినా రాష్ట్రం (అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం) అమలు చేయలేదు. కేంద్ర వాటా మొత్తాన్ని వెనక్కి పంపింది.
- వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో రెండో దశలో భాగంగా మొబైల్ కనెక్టివిటీ.. కొన్ని గ్రామాల్లో 4జీ మొబైల్ కవరేజి ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి.
- రూ.32,797 కోట్లతో చేపట్టిన రిలయన్స్ జియో 4జీ, 5జీ విస్తరణ ప్రాజెక్టుకు అనుమతులు.. అటవీ క్లియరెన్సులు పెండింగ్ లో ఉన్నాయి.
- రూ.18,189 కోట్లతో చేపట్టిన జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల.. రాజీవ్ బీమా ఎత్తిపోతల.. శ్రీరామసాగర్ ప్రాజెక్టు రెండోదశ పనుల కోసం భూసేకరణ న్యాయవివాదాలు పెండింగ్ లో ఉన్నాయి.
- బీబీనగర్ లో ఎయిమ్స్ కు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం వివిద సంస్థలకు విద్యుత్.. నీటి కనెక్షన్లకు సంబంధించి రూ.1365 కోట్ల నిధులు విడుదల చేయాల్సి ఉంది.
- శంషాబాద్ లో ప్రభుత్వ భూమిని కేటాయించని కారణంగా 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం పెండింగ్ లో ఉంది.
- అటవీ అనుమతులు మంజూరు కాని కారణంగా మనోహరాబాద్ -కొత్తపల్లి రైల్వే లైన్.. కాజీపేట - విజయవాడ మూడో లైన్ విద్యుద్దీకరణ పెండింగ్ లో ఉంది.