'స్థానికం'లో బీసీ మంత్రం.. రేవంత్ వ్యూహం ఫ‌లించేనా?

తెలంగాణ ప్ర‌భుత్వం.. బీసీ మంత్రం ప‌ఠిస్తోంది. బీసీల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాల‌ను కూడా ముమ్మ‌రం చేసింది.

Update: 2025-02-13 10:30 GMT

తెలంగాణ ప్ర‌భుత్వం.. బీసీ మంత్రం ప‌ఠిస్తోంది. బీసీల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాల‌ను కూడా ముమ్మ‌రం చేసింది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల విడుద‌ల చేసిన కుల గ‌ణ‌న లెక్క‌ల‌ను బ‌ట్టి.. రాష్ట్రంలోని బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ ఇవ్వాల‌ని తీర్మానం చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌, దీనిని బ‌డ్జెట్ అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌వేశ పెట్టి.. ఆమోదించే దిశ‌గా కూడా కార్యాచ‌ర‌ణ ప్రారంభ‌మైంది. అనంత‌రం.. దీనిని కేంద్రానికి పంప‌నున్నారు. అక్క‌డ కూడా ఆమోదం పొందితే.. చ‌ట్టంగా మారి అమ‌లు ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంది.

అయితే.. ఇదంత తేలిక‌గా అయ్యే ప్ర‌క్రియ కాదు. తెలంగాణ‌లోని కాంగ్రెస్ స‌ర్కారుకు స‌హ‌క‌రించి.. బీసీల బిల్లుకు ఆమోదం తెలిపేంత ఉదార‌త కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు ఉంటుంద‌ని ఊహించ‌లేం. సో.. ఇది కేవ‌లం శాస‌న స‌భ‌లో ఆమోదం అయితే పొందొచ్చు కానీ.. కేంద్రంలో ఆమోదం అంటే.. కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం కానుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదిలావుంటే.. బీసీ రిజర్వేష‌న్ బిల్లు ఆమోదం పొందే వ‌ర‌కు కూడా.. రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించే యోచ‌న క‌నిపించ‌డం లేదు.

ఇదిమ‌రింత విచిత్రం. ఎందుకంటే.. రిజ‌ర్వేష‌న్ ప్ర‌క‌టించినంత మాత్రాన‌.. అది ఆమోదం పొందాల్సిన అవ‌స‌రం కేంద్రం వ‌ద్ద ఉంది. సో.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి స‌ర్కారు వేసిన అడుగులు కేవ‌లం ఒక‌టి మాత్ర మే. కాబ‌ట్టి.. 42 శాతం బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాకే.. ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని ఆయ‌న చెబుతున్నా.. దాని వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. శాస‌న స‌భ‌లో ఆమోదం పొందినా.. అదికేంద్రం వ‌ద్ద కూడా ముద్ర వేయించుకోవాల్సి ఉంటుంద‌ని.. కేవ‌లం అసెంబ్లీలో ఆమోదం తెలిపి.. దీనిని తాయిలంగా చూపించి స్థానిక ఎన్నిక‌ల‌కు వెళ్లినా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని చెబుతున్నారు.

పైగా విప‌క్షాల నుంచి వ్య‌తిరేక ప్ర‌చారం ఇప్ప‌టికే ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ..రేవంత్‌రెడ్డి తీసుకున్న ట‌ర్న్ స‌రికాద‌న్న అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీసీలకు రిజ‌ర్వేషన్‌ను 42 శాతానికి పెంచార‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్నా.. ఇదిఎప్పుడు అమ‌ల‌వుతుంది? అమ‌లైనా.. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు, ఉపాధికి వ‌ర్తింప‌జేస్తారా? అన్న ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. సో.. ఎలా చూసుకున్నా.. బీసీ రిజ‌ర్వేష‌న్ కోస‌మే స్థానిక ఎన్నిక‌ల‌ను నిలుపుద‌ల చేయ‌డం స‌రికాద‌ని..ప్ర‌భుత్వ ప‌నితీరుపైనే ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని అంటున్నారు. పాల‌న‌కే ప్ర‌జ‌లు మొగ్గు చూపుతార‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News