సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, అల్లు అర్జున్... రేవంత్ కామెంట్స్ వైరల్!

అవును... అల్లు అర్జున్ అరెస్ట్ పై రాజకీయ దుమారం రేగిందనే చర్చ నడుస్తున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.

Update: 2024-12-13 18:41 GMT

సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. 'ఇండియా టుడే' నిర్వహించిన చర్చా వేదికలో స్పందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... అల్లు అర్జున్ అరెస్ట్ పై రాజకీయ దుమారం రేగిందనే చర్చ నడుస్తున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... 'ఈ దేశంలో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ లు ఎందుకు అరెస్టయ్యారు?' అని ప్రశ్నిస్తూ... 'ఒక సాధారణ పౌరుడి దగ్గర నుంచి ప్రధాన మంత్రి వరకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ సమంగా వర్తిస్తుంది' అని అన్నారు.

ఇదే సమయంలో... "పుష్ప-2" విడుదల సందర్భంగా బెనిఫిట్ షోకు తాము అనుమతి ఇచ్చామని.. రూ.3 వేల ఖరీదైన టిక్కెట్ రూ.1100 లకే వచ్చేలా చేశామని.. అయితే, ఈ షోకు ముందస్తు అనుమతి లేకుండా అల్లు అర్జున్ అక్కడకు వచ్చారని.. ఆయన్ను చూసేందుకు అభిమానులు పోటెత్తారని.. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిందని రేవంత్ తెలిపారు.

ఇదే సమయంలో ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడని.. ఈ క్రమంలో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారని.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన వారిని అరెస్ట్ చేశారని సీఎం తెలిపారు. ఈ క్రమంలోనే 10 రోజుల తర్వాత అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.

అరెస్టు అనంతరం కోర్టులో హాజరు పరిచారని.. కోర్టు ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసిందని తెలిపారు. ఈ క్రమంలో... కావాలనే సినిమా నటుడిని అరెస్ట్ చేశారనే చర్చ మొదలు పెట్టారని.. అతడు సినిమా స్టారా.. పొలిటికల్ స్టారా అనే విషయాన్ని తమ ప్రభుత్వం చూడదని.. నేరం ఏవరు చేశారన్నదే చూస్తామని రేవంత్ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే.. అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చి సినిమా చూసి మాత్రమే వెల్లలేదని.. కారులో నుంచి బయటకు వచ్చి, చేతులు ఊపుతూ ర్యాలీలా అభివాదం చేశారని.. అసలు అలాంటి హంగామా లేకుండా సినిమా చుసి ఉంటే ఈ గొడవే అయ్యేది కాదని.. అయినప్పటికీ ఈ కేసులో ఏ11కింద ఆయనపై కేసు నమోదు చేశారని రేవంత్ పేర్కొన్నారు.

ఈ ఘటన కారణంగా ఓ మహిళ చనిపోతే.. అందుకు బాధ్యులు ఎవరు..? 9 ఏళ్ల పిల్లాడు చావు బతుకుల మధ్య ఉంటే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు..? అని ప్రశ్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... అల్లు అర్జున్ సినిమా చూడాలనుకుంటే ఇంట్లో కూర్చునో, స్టూడియోలో స్పెషల్ షో వేసుకునో చూడొచ్చని అన్నారు.

అలా కాకుండా ప్రేక్షకులు, అభిమానులతో కలిసి సినిమా చూడాలనుకుంటే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. లేదంటే.. మేనేజ్మెంట్ కు సమాచారం ఇస్తే వాళ్లు ఏర్పాట్లు చేసుకుంటారని.. అలా కాకుండా సడన్ గా వచ్చేస్తే.. ఉన్న కొద్దిమంది సిబ్బందితో వాళ్లు ఎలా సిద్ధం కాగలరని రేవంత్ ప్రశ్నించారు.

ఇదే సమయంలో సినిమా వాళ్లు డబ్బులు పెట్టారు.. డబ్బులు సంపాదించారు.. వాళ్లు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏమీ లేదు? అంటూ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు! అదేవిధంగా... ఇక అల్లు అర్జున్ ని కావాలని అరెస్టు చేసామని అంటున్నారని.. అసలు అలా ఎందుకు అరెస్ట్ చేస్తామని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

ఈ సందర్భంగా... ఆయన మేనమామ చిరంజీవి కాంగ్రెస్ నేత అని.. ఆయన సొంతమామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారని.. అల్లూ అర్జున్ సతీమణి స్నేహరెడ్డితో తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు రేవంత్ రెడ్డి. ఈ వ్యవహారంలో పోలీసులు చేయాల్సిన పని వాళ్లు చేస్తారని.. లా అండ్ ఆర్డర్ ప్రకారం నడుచుకుంటారని రేవంత్ స్పష్టం చేశారు.

ఇలా... సంజయ్ దత్ అయినా, సల్మాన్ ఖాన్ అయినా, అల్లు అర్జున్ అయినా, సామాన్యుడు అయినా, ప్రధానమంత్రి అయినా అందరికీ రాజ్యాంగం ఒక్కటే.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ రేవంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి!

Tags:    

Similar News