కేసీఆర్ కాసుకో.. తగ్గేదేలే అంటున్న రేవంత్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తగ్గేదేలే అంటూ ఫైర్ అవుతున్నారు.;

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తగ్గేదేలే అంటూ ఫైర్ అవుతున్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ తన స్వార్థం కోసం తప్ప రాష్ట్రం కోసం పనిచేయడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఉగాది రోజు పేదలకు సన్నబియ్యం పంపిణీ సందర్భంగా నల్లగొండలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు. 80 వేల పుస్తకాలు రాసినోడు పేదలకు సన్నబియ్యం ఇవ్వలేకపోయారని, లక్ష ఎకరాలకు సాగునీరిస్తామని చెప్పి కూళేశ్వరం ప్రాజెక్టు కట్టారని సెటైర్లు వేశారు.
పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ రైతాంగంపై పగబట్టినట్లు SLBC టన్నెల్ పడావు పెట్టారని ఆరోపించిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ ని ఉరేసినా తప్పులేదన్నారు. ‘‘పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ SLBC టన్నెల్ పడావు పెట్టాడు. 34 కిలోమీటర్లు పూర్తయిన SLBCని ఏడాదికి ఒక కిలోమీటర్ తవ్వినా అయిపోయేది. కానీ, చేయలేదు. పడావు పడిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మూడేళ్లలో కేసీఆర్ లక్ష కోట్లు మింగి కూళేశ్వరం కట్టాడు. లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు మూడేళ్లలో కూలిపోయింది. కేసీఆర్ ను ఉరేసినా తప్పులేదు’’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ ధ్వజమెత్తారు.
కేసీఆర్ నా ఇంటి తలుపులు బద్ధలు కొట్టి అరెస్టు చేసినా 8 నెలల్లో ఎంపీని అయ్యాను. 2006లో జడ్పీటీసీగా రాజకీయం మొదలుపెట్టిన నేను 2024లో ముఖ్యమంత్రి అయ్యాను శకునం పలికే బల్లి కుడితిలో పడినట్లు బీఆర్ఎస్ వాళ్ల పరిస్థితి ఉంది మూడు కోట్ల మందికి సన్న బియ్యం ఇచ్చి తీరతాం, 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం అంటూ సీఎం వివరించారు.