సీఎం రిలీఫ్ కు కేసీఆర్ ఫ్యామిలీ రూ.2వేల కోట్లు ఇవ్వాలన్న రేవంత్

భారీ వర్షాలతో విరుచుకుపడిన వరదలతో ఖమ్మం పట్టణం అతలాకుతలం కావటం తెలిసిందే.

Update: 2024-09-03 12:23 GMT

భారీ వర్షాలతో విరుచుకుపడిన వరదలతో ఖమ్మం పట్టణం అతలాకుతలం కావటం తెలిసిందే. తీవ్రంగా నష్టపోయిన ఖమ్మంను సందర్శించిన రేవంత్.. ఈ రోజు కూడా అక్కడే ఉండి.. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. భారీ వరదలకు కారణం ఏమిటి? ఇంతటి బీభత్సం వెనుకున్న ఇష్యూలేంటి? లాంటి అంశాలపై రివ్యూ చేసిన సీఎం రేవంత్.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ కు సూటి సవాలు విసిరారు. హరీశ్ కు దమ్ముంటే.. తాను విసిరిన సవాలుకు స్పందించాలన్న రేవంత్.. ‘‘అక్రమణల వల్లే ఖమ్మంలో భారీ వరదలకు కారణం. అక్రమించుకున్న స్థలంలోనే మాజీ మంత్రి పువ్వాడ ఆసుపత్రి కట్టారు. పువ్వాడ ఆక్రమణలపై హరీశ్ స్పందిస్తారా?’’ అంటూ సవాలు విసిరారు.

తమ ప్రభుత్వం ముందు చూపు కారణంగా ప్రాణనష్టం తగ్గిందన్న సీఎం రేవంత్.. నగరంలో ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయన్న విషయాన్ని సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తిస్తామన్నారు. అనంతరం వాటిని తొలగిస్తామని తేల్చేశారు. 75 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 42 సెంటీమీటర్ల వర్షం పడిందన్న ముఖ్యమంత్రి రేవంత్.. ఖమ్మంలో భారీ వరదలకు అక్రమ కట్టడాలుగా తేల్చేశారు. ఖమ్మంలోని ఆక్రమణల గురించి మాట్లాడుతూ.. ‘‘ఖమ్మంలో ఎవరి అక్రమాలేంటో తేల్చేద్దాం. హరీశ్ రావాలి. కేటీఆర్ విదేశాల్లో ఉండి ఏదేదో మాట్లాడుతున్నారు. కేసీఆర్ కుటుంబం వద్ద రూ.లక్ష కోట్లు ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.2వేల కోట్లు ఇవ్వాలి’’ అంటూ డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ విసిరిన సవాలుపై మాజీ మంత్రి హరీశ్ స్పందించారు. వరద బాధితులకు ధైర్యం చెప్పకుండా బీఆర్ఎస్ పై నిందలు వేయటం సరికాదన్న హరీశ్.. సవాలుపై మాత్రం రియాక్టు కాకపోవటం గమనార్హం. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాల్వ తెగిపోయిందన్న హరీశ్.. ‘ఈ ప్రభుత్వం చేతకాని దద్దమ్మ. చేతకాని ప్రభుత్వం. రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఎకరాకు రూ.50వేల పంట నష్టపరిహారం అందించాలి’ అంటూ మండిపడ్డారు.

Tags:    

Similar News