రేవంత్ Vs చంద్రబాబు.. గురుశిష్యుల మధ్య యుద్ధం మొదలు?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య లొల్లి మొదలైంది. ఇరు రాష్ట్రాల మధ్య నీటివనరుల పంపకం నేతల మధ్య అగ్గిరాజేస్తున్నట్లు కనిపిస్తోంది;

Update: 2025-03-05 12:30 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య లొల్లి మొదలైంది. ఇరు రాష్ట్రాల మధ్య నీటివనరుల పంపకం నేతల మధ్య అగ్గిరాజేస్తున్నట్లు కనిపిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంపై చంద్రబాబు అసంతృప్తితోపాటు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తామంటే తాము వద్దన్నామా? అంటూ ప్రశ్నించారు? దీంతో ఇద్దరు నేతల మధ్య గ్యాప్ పెరుగుతుందనే టాక్ వినిపిస్తోంది.

ఏపీ సీఎం చంద్రబాబు అంటే తనకు ఎంతో గౌరవమంటూనే తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయనతో వివాదానికి రెడీ అవుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకేతాలు పంపుతున్నారు. ఏపీలోని రాయలసీమ, పల్నాడు జిల్లాల్లో కరువు రూపుమాపడానికి గోదావరి జలాలను తరలించాలనే చంద్రబాబు ప్రణాళికను అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డి రంగంలో దిగారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య క్రిష్ణా జలాల సమస్య ఉండగా, తాజాగా గోదావరి జలాలను వాడుకునేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై ఏపీ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంపై చంద్రబాబు స్పందించారు. సముద్రంలో వృథాగా కలిసే నీటినే తాము వాడుకోవాలని అనుకుంటున్నామని తెలిపారు. వృథా నీటితో బనకచర్ల కడితే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే తాము అభ్యంతరం చెప్పలేదన్న విషయాన్ని గుర్తుచేశారు. నీళ్లు వృథా కాకుండా తెలంగాణ కూడా నీటిని వాడుకోవచ్చునని సలహా ఇచ్చారు. సముద్రంలో కలిసే వరద నీటిని కరువు నేలకు తరలించే ప్రక్రియను అడ్డుకోవద్దని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

కాగా, ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంపై జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి కంప్లెయింట్ చేసిన గంటల వ్యవధిలోనే ఏపీ సీఎం స్పందించారు. అయితే ఈ వివాదంపై కేంద్రం నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు గురు, శిష్యుల మధ్య మొదలైన నీళ్ల పంచాయితీ ఎటు దారితీస్తుందనేది వాడివేడి చర్చకు దారితీస్తోంది.

Tags:    

Similar News