రేవంత్ వర్సెస్ చంద్రబాబు.. మధ్యలో కేసీఆర్.. !
దావోస్ లో ఇరువురు పర్యటించినా.. పెట్టుబడులు తెచ్చినా.. తేకున్నా.. ఒకరిపై ఒకరు ప్రశంసలు గుప్పించుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబు.. రాజకీయాల్లో గురుశిష్యులనే మాట వినిపి స్తుంటుంది. అయితే.. దీనిని రేవంత్ కొట్టిపారేయొచ్చు. కానీ, ఆది నుంచి గమనించిన వారు... మాత్రం ఈ బంధాన్ని కొట్టిపారేయలేరు. దీంతో గత ఎనిమిది నెలలుగా.. ఇరు రాష్ట్రాలూ ఇబ్బందులు లేని విధంగా ముందుకు సాగుతున్నాయి. దావోస్ లో ఇరువురు పర్యటించినా.. పెట్టుబడులు తెచ్చినా.. తేకున్నా.. ఒకరిపై ఒకరు ప్రశంసలు గుప్పించుకున్నారు.
''చంద్రబాబు విజన్ ఏంటో.. ఆయన తపన ఏంటో దావోస్‌లో చూశాం'' అని.. తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చేసిన కామెంట్లు.. సీఎంల మధ్య ఉ న్న సంబంధానికి పరాకాష్టగానే చూడాలి. ఇలా సాగిన ప్రయాణం ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఎప్పటి నుంచో ఉన్న జలాల వివాదాన్ని తవ్వి తీసింది. ఏపీకి చుక్క నీరు అదనంగా ఇచ్చేందుకు తాము ఏమాత్రం సిద్ధంగా లేమంటూ.. తెలంగాణ తేల్చి చెప్పిం ది. అంతేకాదు.. కేంద్రానికి కూడా ఈ మేరకు లేఖలు సంధించింది.
ఇది.. ఏపీకి శరాఘాతమేననడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం రైతాంగం ఖరీఫ్ పనులు ప్రారం భించిన దరిమిలా.. ఏపీకి కూడా నీటి అవసరం ఎంతో ఉంది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా రేవంత్ సర్కారు ఏపీ సర్కారు కాళ్లకు బంధాలు వేసింది. ఇది ఎంత దూరం వెళ్లినా.. ఫర్వాలేదని కూడా తేల్చి చెబుతుండడం గమనార్హం. అయితే.. ఇంతగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకు? అనేది చూస్తే.. కేసీఆర్ కనిపిస్తున్నారు.
మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. యాక్టివ్ అవుతున్నారు. ఈయన ఎంత యాక్టివ్ అయితే.. అంత ప్రభావం ఏపీపై పడుతుంది. ఎందుకంటే.. రేవంత్‌రెడ్డిని ఏ చిన్న అవకాశం ఉన్నా.. ఏకేసేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. సో.. ఈ అవకాశం ఇస్తే..రేవంత్ ఇబ్బందుల్లో పడినట్టే. కేసీఆర్.. వచ్చే నెల నుంచి ప్రజల మధ్యకు కూడా రానున్నారు. ఈ క్రమంలో నీటి విషయంలో ఏపీకి అనుకూలంగా ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా.. అది రేవంత్‌కు ఇబ్బంది. అందుకే.. కేసీఆర్ కు అవకాశం ఇవ్వకుండా.. రేవంత్ ముందుగానే ఏపీని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నది విశ్లేషకుల అంచనా. మరి దీనిని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.