మూసీ మీద అంత మొండితనం ఎందుకు రేవంత్?

ఆయన ఏదైనా విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే.. దాని లెక్క తేల్చే వరకు వదిలి పెట్టరు.

Update: 2024-10-07 14:17 GMT

పాలకుడిగా ఉన్న వ్యక్తి ప్రతిష్ఠాత్మకంగా ఒక ప్రోగ్రాంను భావించిన తర్వాత.. దాని నుంచి వెనక్కి తగ్గిన దాఖలాలు కనిపించవు. కొన్ని ప్రాజెక్టులు పాలకులకు వరంగా మారితే.. మరికొన్ని మాత్రం శాపంగా మారతాయి. మూసీని సుందీకరించే విషయంలో ఇప్పటివరకు పాలకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దాన్ని టేకప్ చేయటం అంటే.. కుక్కతోకను పట్టుకొని గోదారి ఈదినట్లుగా గ్రహించిమధ్యలోనే వదిలేశారు. అందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. ఆయన ఏదైనా విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే.. దాని లెక్క తేల్చే వరకు వదిలి పెట్టరు.

అదే సమయంలో తాను అనుకున్నది తలకు మించిన అంశంగా భావిస్తే.. దాన్ని ఇట్టే వదిలేస్తారు. అందుకు నిదర్శనంగా హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన కొన్ని అంశాలు కనిపిస్తాయి. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరినీళ్లుగా మారుస్తానని.. మూసీని అత్యద్భుతంగా చేస్తానని.. బోట్లలో షికార్లు కొట్టేలా చేస్తానని.. నగర వ్యాప్తంగా ఉన్న అక్రమ కట్టడాల అంతు చూస్తానని.. నల్లాల మీద ఉన్న ఇళ్లను కొట్టేస్తానని.. ఎంత పెద్ద వర్షం పడినా.. నగరంలో నీళ్లు అన్నది నిలవకుండా ఉండేలా చేస్తా.. ఇలా చాలానే మాటలు చెప్పారు. కానీ.. తాను చెప్పినవేమీ అంత సులువైన అంశాలు కావన్న విషయాన్ని గుర్తించిన కేసీఆర్.. వాటిని మధ్యలోనే వదిలేశారు.

పదేళ్లు తిరుగులేని అధికారాన్ని చెలాయించిన ఆయనే.. మూసీ విషయాన్ని మూసీకే వదిలేశారు. కానీ.. తాజా ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం గట్టి కమిట్ మెంట్ తో ఉన్నారు. తన హయాంలో మూసీని డెవలప్ చేయాలని.. దాని రూపురేఖలు మార్చటం ద్వారా చరిత్రలో తాను నిలిచిపోవాలన్నట్లుగా ఆయన తీరు ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శల్ని మూటకట్టుకుంటున్నా.. ఆయన మాత్రం మూసీ విషయంలో తగ్గేదేలె అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా (ఆదివారం రాత్రి) హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ తన ప్రసంగంలో భాగంగా మూసీ మీద.. దాన్ని మార్చే విషయంపై తనకున్న కమిట్ మెంట్ ను మరోసారి తన మాటలతో స్పష్టం చేశారు. మూసీ నది పేరును తమ పిల్లలకు పెట్టేలా ప్రక్షాళన చేస్తానని వ్యాఖ్యానించటం గమనార్హం. కాళేశ్వరంపై రూ.లక్ష కోట్లను కుమ్మరించారని.. మూసీ నిర్వాసితులకు రూ.10వేల కోట్లు ఇచ్చేందుకు సహకరించరా? అని ప్రశ్నించారు.

వారం రోజులు కేటీఆర్.. హరీశ్.. ఈటల మూసీ నదీ పరీవాహకంలో ఉంటే జనాల బాధలు తెలుస్తాయని పేర్కొన్నారు. క్రిష్ణా.. గోదావరి.. గంగ.. యమున.. సరస్వతి.. కావేరి అంటూ నదుల పేర్లు తమ పిల్లలకు పెట్టుకునే తల్లిదండ్రులు.. మూసీ పేరును ఎందుకు పెట్టటం లేదని ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్.. ‘‘అది విషతుల్యం. మురికిమయం అయిపోయింది. అందుకే దానిని ప్రక్షాళన చేపట్టాలని భావించాం. మూసీ వద్దకు ఇలా వచ్చి అలా వెళ్లటం కాదు. కేటీఆర్.. హరీశ్.. ఈటల వారం రోజులు మూసీ పరివాహక నివాసాల్లో ఉండండి. ప్రజలు పడే బాధలు..కష్టాలు తెలుస్తాయి’’ అని వ్యాఖ్యానించారు.

భాక్రానంగల్.. నాగార్జునసాగర్.. శ్రీశైలం.. శ్రీరాంసాగర్ లాంటి ప్రాజెక్టులు ఎన్ని విపత్తులు వచ్చినా చెక్కు చెదర్లేదన్న సీఎం.. ‘‘హైదరాబాద్లో హైకోర్టు.. అసెంబ్లీ.. చార్మినార్ లాంటి ఎన్నో అద్భుత చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వందల ఏళ్లు అయినా చెక్కు చెదరకుండా ఠీగా నిలిచాయి. అలాంటి కట్టడాలు నిర్మించిన ఇంజనీర్లనుఆదర్శంగా తీసుకుంటారా? పదేళ్లలోనే కుప్పకూలిన కాళేశ్వరం కట్టిన వారిని అనుసరిస్తారా? వందేళ్ల అనుభవం ఒకవైపు.. పదేళ్ల దుర్మార్గం మరోవైపు. ఆలోచించుకోవాలి’’ అని పేర్కొన్నారు.

రూ.1.50లక్షల కోట్లకు పెంచిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంకా పనులు మిగిలే ఉన్నాయని.. మల్లన్నసాగర్ నిర్మించిన చోట భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని సాంకేతిక నిపుణులు ముందే నివేదిక ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టులో ఏ రోజూ 15 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నింపలేదన్న సీఎంరేవంత్.. ‘‘మీరు ఎలా కట్టారు? ఎక్కడ కట్టారు? అనే దానిపై విచారణకు సాంకేతిక నిపుణులను నియమిద్దాం. దాని వెనకాల ఉన్న మర్మమేంటో బయటపెడదాం’’అని వ్యాఖ్యానించారు.

ఇరవైఏళ్లుగా పేదోళ్ల మద్య.. ప్రజాజీవితంలో తాను ఉన్నానని.. ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో తనకు తెలీదా? అని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆ దుర్గంధంలోనే బతకాలా? వారికిమంచి భవిష్యత్తు ఉండొద్దా?అని ప్రశ్నించారు. ‘‘రూ.లక్ష కోట్లు కాళేశ్వరం మీద కుమ్మరించారు కదా? రూ.10వేల కోట్లు మూసీ నిర్వాసితులకు ఇవ్వటానికి సహకరించరా? వాళ్లకు మంచి కాలనీలు ఏర్పాటు చేసి.. పాఠశాలలు.. జూనియర్.. ఇంజనీరింగ్ కాలేజీలు కట్టిద్దాం. ప్రతి దానికీ అడ్డుపడటం కాదు. నిర్వాసితులను ఎలా ఆదుకుందామో సలహాలు ఇవ్వండి’’ అంటూ వ్యాఖ్యానించారు. మరి.. దీనికి కేటీఆర్.. హరీశ్.. ఈటల ఎలా రియాక్టు అవుతారో చూడాలి.

Tags:    

Similar News