అసలు నిజం ఇది: ప్రజాభవన్ అని చెప్పి.. డిప్యూటీ సీఎంకు ఇవ్వటమా రేవంత్?

అయితే.. రెండు రోజుల క్రితం ప్రజాభవన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయిస్తున్నట్లుగా ప్రకటన వెలువడింది.

Update: 2023-12-15 05:51 GMT

తెలిసి తెలియకుండా.. విన్నంతనే.. చదివినంతనే ఒక అభిప్రాయానికి వచ్చేయటం పెద్ద తప్పు. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? లాంటి ప్రశ్నలతో క్రాస్ చెక్ చేసుకోకుండా కామెంట్లు చేసే ధోరణి ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలోనూ అదే తీరు వ్యక్తమవుతోంది. తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టినంతనే.. సీఎం అధికారిక నివాసమైన ప్రగతిభవన్ ను మహాత్మ ఫూలే ప్రజాభవన్ గా మార్చటం.. దాన్ని ప్రజల కోసం వినియోగిస్తామని చెప్పటం తెలిసిందే.

అయితే.. రెండు రోజుల క్రితం ప్రజాభవన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయిస్తున్నట్లుగా ప్రకటన వెలువడింది. ఆ వెంటనే కొందరు అత్యుత్సాహంతో సీఎం రేవంత్ ను తప్పు పట్టటం షురూ చేశారు. ప్రజాభవన్ అని చెప్పి భట్టికి ఎలా కేటాయిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. అయితే.. అలా మాట్లాడేవారంతా మర్చిపోతున్న విషయం ఏమంటే.. ప్రజాభవన్ పేరుతో ఉన్న ప్రాంగణంలో మొత్తం నాలుగు భవనాలు ఉంటాయి. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ నివసించిన భవనంతో పాటు.. మరో నాలుగు ఉన్నాయి. వీటిల్లో ఒకదాన్ని ఇప్పటికే ప్రజావాణి కోసం వినియోగిస్తున్నారు.

మరో భవనాన్ని తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు (ఇందులోనే ముఖ్యమంత్రిగా కేసీఆర్ నివాసం ఉండేవారు ). మిగిలిన మూడు భవనాల్లో ఒక భవనాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా.. రెండో దాన్ని ఎవరికైనా మంత్రికి కానీ..లేదంటే రాష్ట్రానికి వచ్చే అతిధులకు వినియోగించుకోవటానికి కేటాయించనున్నారు. ఇందులోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ నివాసం ఉండేవారు. మిగిలిన మూడో భవనంలో ఎస్సీ.. ఎస్టీ బీసీ విద్యార్థులకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. అంటే.. ప్రజాభవన్ లోని ఐదు భవనాలు.. ఐదుగురికి కేటయించటం చూస్తే.. ఉన్న వనరుల్ని పూర్తిగా వినియోగించే తీరును సీఎం రేవంత్ ప్రదర్శించారని చెప్పాలి. అంతేకాదు.. ఈ మొత్తం భవనాల సముదాయాన్ని గతంలో ముఖ్యమంత్రి నివాసంగా ఉండేది.ఇప్పుడు అర్థమైందా? రేవంత్ తీసుకున్న నిర్ణయంలోని అసలు మర్మం?

Tags:    

Similar News