రేవంత్ అమెరికా టూర్ సక్సెస్.. పీఆర్ టీం ప్లాప్!
సీఎం వ్యవహారాల్ని నిశితంగా చూసే వారు సైతం.. తన రెండో పర్యటనలోనే ఇంతటి ప్రభావాన్నిచూపటం.. తెలంగాణ ఇమేజ్ ను పెంచేందుకు వీలుగా ప్రస్తావించిన అంశాలపై సంత్రప్తి వ్యక్తం చేస్తున్నారు.
అద్భుతంగా కూర వండేస్తే సరిపోదు. అందులో ఉప్పు తగినంత ఉందా? లేదా? అన్నది చెక్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ పరిస్థితి ఉందంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసినంతనే యూఎస్.. సౌత్ కొరియాల్లో పర్యటించిన వైనం తెలిసిందే. అంచనాలకు మించిన రీతిలో రేవంత్ రెండో ఫారిన్ టూర్ సక్సెస్ అయినట్లుగా ప్రభుత్వం భావిస్తోంది. సీఎం వ్యవహారాల్ని నిశితంగా చూసే వారు సైతం.. తన రెండో పర్యటనలోనే ఇంతటి ప్రభావాన్నిచూపటం.. తెలంగాణ ఇమేజ్ ను పెంచేందుకు వీలుగా ప్రస్తావించిన అంశాలపై సంత్రప్తి వ్యక్తం చేస్తున్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో ఐటీ వ్యవహారాలతో పాటు.. విదేశీ పెట్టుబడుల విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా చూసేవారు. కొడుకే కావటంతో కేసీఆర్ సైతం ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. రేవంత్ ప్రభుత్వంలో కేటీఆర్ తరహాలో ఇష్యూస్ ను డీల్ చేసే సత్తా ఎవరికి ఉందన్నది ప్రశ్నగా మారింది. అయితే.. దీనికి తానే ఉన్న విషయాన్ని రేవంత్ తన తాజా విదేశీ పర్యటనతో ఫ్రూవ్ చేశారని చెప్పాలి.
పలు కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు.. ప్రాజెక్టులతో పాటు.. హైదరాబాద్ లో తాను నిర్మించాలని తలపెడుతున్న ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశాల్ని అందరికి ఆకట్టుకునేలా చేయటాన్ని అభినందిస్తున్నారు. పలు సంస్థల ప్రతినిధులతో బిజీబిజీగా గడిపిన రేవంత్.. తనకు తాను నూటికి నూటయాభై మార్కులు వేయించుకున్నారు. ఇంతటి సక్సెస్ సొంతం చేసుకున్నప్పటికీ.. ఆయన పీఆర్ టీం వీక్ గా ఉండటంతో రావాల్సినంత మైలేజీ రాలేదంటున్నారు.
మీడియాలో అంతంత మాత్రంగా.. సోషల్ మీడియాలో అసలే లేకుండా పోవటాన్ని తప్పు పడుతున్నారు. ఫారిన్ టూర్ సందర్భంగా విడుదల చేసిన వీడియోలు.. ఫోటోలు సైతం వీక్ గా ఉన్నాయని.. రేవంత్ ఇమేజ్ ను మరింత పెంచేలా ప్రయత్నాలు సాగలేదంటున్నారు. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్ అన్న సామెత తరహాలో రేవంత్ తాజా యూఎస్ పర్యటన సాగినట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ని మంచి పనులు చేసినప్పటికి.. వాటిని సరైన పద్దతుల్లో ప్రచారం చేసుకోకపోతే.. ఏమీ చేయలేదనే ముద్ర పడుతుంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ త్వరగా గుర్తించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం చేస్తారో చూడాలి.