చంద్రబాబు స్థాపించిన సంస్థలో రేవంత్ క్యాంప్?
2009 తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సమయంలోనూ రేవంత్ వంటి తెలంగాణ నేతలకు చంద్రబాబు స్వేచ్ఛనిచ్చారు.
ఎవరెన్ని చెప్పినా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా లిఫ్ట్ ఇచ్చింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే. 2007లో కాంగ్రెస్ సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా సాగుతుండ గా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు రేవంత్. జడ్పీటీసీ సభ్యుడిగా 2006లో పోటీ చేసినప్పుడూ టీడీపీ మద్దతు బలంగా ఉంది. ఇక ఎమ్మెల్సీగా గెలుపుతో రేవంత్ ప్రత్యేకతను గుర్తించిన చంద్రబాబు ఆయనను టీడీపీలోకి ఆహ్వానించారు. అధికార ప్రతినిధిగా పెద్ద బాధ్యతలే అప్పగించారు. 2009లో కొడంగల్ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాతి సంగతి అందరికీ తెలిసిందే.
ఉద్యమంలో.. తెలంగాణ వచ్చాక..
2009 తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సమయంలోనూ రేవంత్ వంటి తెలంగాణ నేతలకు చంద్రబాబు స్వేచ్ఛనిచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక, రేవంత్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించారు. అయితే , రాజకీయ పరిణామాల రీత్యా రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్లారు. దీనికిముందుగా ఆయన.. ఏపీ సీఎంగా అమరావతిలో ఉన్న చంద్రబాబు వద్దకు వెళ్లి తాను పార్టీని వీడుతున్న సంగతిని మర్యాదగా తెలియజేశారు. ఇక 2018 ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్-వామపక్షాల పొత్తులోనూ రేవంత్ క్రియాశీలంగా వ్యవహరించారు.
పాలనలో అదే ముద్ర
తొలిసారి సీఎం అయిన చంద్రబాబు హయాంలో ప్రజల వద్దకు పాలన అంటూ సరికొత్తగా వ్యవహరించారు. పాలనా యంత్రాంగంలో ఇదో అనూహ్య మార్పునకు దారితీసింది. కాగా, తెలంగాణలో తాజాగా సీఎం అయిన రేవంత్ రెడ్డి సైతం ప్రజా పాలన అందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. తన క్యాంపు కార్యాలయంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్ హెచ్ ఆర్డీ)ను ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. 45 ఎకరాల విస్తీర్ణంలో 375 సెంట్రల్ ఏసీ గదులు, 250 మంది కూర్చునే ఆడిటోరియం, పెద్ద పెద్ద సమావేశ మందిరాలతో కూడిన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చే యోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం.
చంద్రబాబు స్థాపించినదే..
ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉండగా 2002 ప్రాంతంలో జూబ్లీహిల్స్ లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పారు. అధికార యంత్రాంగాన్ని సుశిక్షిత సిబ్బందిగా తీర్చిదిద్దే లక్ష్యంతో దీనిని స్థాపించారు. వాస్తవానికి మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ దిగ్గజ నేత. అలాంటి వ్యక్తి పేరును శిక్షణా సంస్థకు పెడుతూ టీడీపీ అధినేతగా, ఆ పార్టీ తరఫున సీఎంగా ఉన్న చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో కొందరు వ్యతిరేకించారు. కానీ, మర్రి చెన్నారెడ్డి పాలనాదక్షులు. ‘‘నా మాటే జీవో’’ అనేవారు. అధికారులు ఆయన వద్దకు ఫైళ్లు తీసుకెళ్లాలంటే గడగడలాడిపోయేవారు. ప్రతి ఫైల్ ను క్షుణ్నంగా చదివాక కాని.. సంతకం చేసేవారు కాదు. అంతటి సమర్థులు కాబట్టే చెన్నారెడ్డి పేరును అధికార యంత్రాగానికి శిక్షణ ఇచ్చే సంస్థకు పెట్టారు చంద్రబాబు. పరోక్షంగా అధికారులూ అలానే వ్యవహరించాలనే ఉద్దేశమూ ఇందులో కనిపిస్తోంది. ఇప్పుడు ఆ సంస్థనే తన క్యాంపు కార్యాలయంగా మార్చుకోనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాగా, రేవంత్ ఇల్లు కూడా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి సమీపంలోనే ఉంటుంది. దీనికి దగ్గరగానే ఎంసీహెచ్ఆర్డీ. ఎలాగూ ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా పేరు మార్చి.. అందులో నివాసం ఉండబోనని చెప్పినందున రేవంత్.. తన ఇంటి సమీపంలోని ఎంసీహెచ్ఆర్డీని క్యాంపు కార్యాలయంగా చేసుకుంటే అనువుగా ఉంటుందని భావించినట్లున్నారు.