కాళేశ్వరంపై కీలక నిర్ణయం!
ఈమధ్యనే జరిగిన ఎన్నికల్లో ఎంతో వివాదాస్పదమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నది.
ఈమధ్యనే జరిగిన ఎన్నికల్లో ఎంతో వివాదాస్పదమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నది. తొందరలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేయించబోతున్నట్లు భారీ నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీయార్ ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా తరచూ చెప్పుకునే వారు. అయితే ఎన్నికల సమయంలో అసలా ప్రాజెక్టుగురించి కేసీయార్, కేటీయార్, హరీష్ రావు పొరబాటున కూడా ప్రస్తావించలేదు.
ఎంతో అద్భుతమైన, తెలంగానాకు గర్వకారణమని చెప్పుకున్న కాళేశ్వరం గురించి కేసీయార్ అండ్ కో ఎందుకని ఒక్కసారిగా కూడా ప్రస్తావించలేదు ? ఎందుకంటే కాళేశ్వరంపై కేసీయార్ అండ్ కో చెప్పిందంతా అబద్ధాలేనని ఎన్నికల ముందు బయటపడటమే. ఎన్నికల ముందు ఆమధ్య కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు పంప్ హౌస్ మొత్తం ముణిగిపోయింది. పవర్ జనరేటర్లన్నీ ముణిగిపోయాయి. మోటార్ల నీటి ముణిగిపోవటంతో బురదంతా లోపలకు వెళ్ళిపోయి మోటార్లు పనిచేయటం మానేశాయి. దాంతో విదేశాల నుండి ఇంజనీర్లను రప్పించి బాగుచేయించాల్సొచ్చింది.
దీంతోనే కాళేశ్వరం ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తోందో జనాలందరికీ తెలిసొచ్చింది. అంతేకాకుండా ఎన్నికలకు సరిగ్గా ముందు కాళేశ్వరం ప్రాజెక్టు పరిదిలోని మేడిగడ్డ బ్యారేజి పిల్లర్ కుంగిపోయింది. పిల్లర్ కుంగిపోవటంతో బ్యారేజీ పైన కూడా పగుళ్ళొచ్చాయి. ఈ ఘటన పెద్ద సంచలనమైంది. దాంతో అటు కాళేశ్వరం గురించి ఇటు మేడిగడ్డ బ్యారేజి గురించి కేసీయార్ అండ్ కో ఒక్కసారిగా కూడా ప్రస్తావించలేదు. దీన్న అడ్వాంటేజ్ తీసుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండ్ కో కేసీయార్ అండ్ కో ను దుమ్ముదులిపేశారు. రెండు ప్రాజెక్టులపై రేవంత్ చేసిన ఆరోపణలకు కేసీయార్ సమాధానం చెప్పుకోలేకపోయారు.
ఎంతో గొప్పదిగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టే చివరకు కేసీయార్ కొంపముంచేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో వేలకోట్ల రూపాయలు అవినీతి జరిగిందని రేవంత్ అండ్ కో పదేపదే ఆరోపించారు. ఇపుడా ప్రాజెక్టులో జరిగిన అవినీతిపైనే రేవంత్ ప్రభుత్వం తొందరలోనే విచారణ జరిపించేందుకు రెడీ అయ్యింది. ఈ ప్రాజెక్టులపైన రేవంత్ కూడా ఒకసారి ఫైనల్ గా రివ్యూ చేసిన తర్వాత విచారణపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.