రేవంత్ ఎఫెక్టా? కాంగ్రెస్ ఎఫెక్టా? మంత్రులకు టెన్షన్
అయితే.. ఈ స్థానాల్లో విజయం దక్కించుకునే పూర్తి బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డిపైనే కాంగ్రెస్ అధిష్టానం పెట్టింది. అందుకే ఆయన తీవ్రంగా పోరాడుతున్నారు.
తెలంగాణలో మంత్రులకు భారీ టెన్షన్ పట్టుకుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో 17 స్థానాలకు ఎట్టి పరిస్థితి లోనూ 14-15 స్థానాల్లో విజయం దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆదిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ స్థానాల్లో విజయం దక్కించుకునే పూర్తి బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డిపైనే కాంగ్రెస్ అధిష్టానం పెట్టింది. అందుకే ఆయన తీవ్రంగా పోరాడుతున్నారు. గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నాక.. ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో తమ సత్తా చాటుకోకపోతే.. ఇబ్బంది వస్తుందనే విషయం ఒకవైపు పార్టీని వేధిస్తోంది.
మరో వైపు.. అధికారంలోకి వచ్చీ రాగానే.. గ్యారెంటీలను అమలు చేస్తున్న ప్రభుత్వంగా ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటి తాలూకు ఫలితం.. ఓట్ల రూపంలో రాబట్టుకోకపోతే.. మరో ఇబ్బంది వస్తుందనే ఆలోచన పార్టీని కలవర పెడుతోంది. దీంతో క్షేత్రస్థాయిలో ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండానే పార్టీ పరుగులు పెడుతోంది. ముఖ్యంగా మోడీ వంటి బలమైన వ్యక్తిని ఎదుర్కొనేందుకు పార్టీ శత విధాల సిద్ధమైంది. కానీ, అనుకున్నంత ఈజీగా అయితే... పోలింగ్ జరిగేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రేవంత్ అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. ఈయనతో పాటు.. మంత్రులు కూడా పరుగులు పెడుతున్నారు.
మొత్తం 17 స్థానాల్లో బలమైన అభ్యర్థులనే నిలబెట్టినా.. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను అందిపుచ్చుకుని ప్రతివ్యూహాలు వేసుకుం టూ ముందుకు పోయే సమయం వారికి తక్కువగా ఉండడం.. మరో రెండు రోజుల్లోనే పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు మంత్రులంతా నియోజకవర్గాలను చుడుతున్నారు. ఆపశోపాలు పడుతున్నారు. అభ్యర్థుల పక్షాన వారి కంటే వేగంగా మంత్రు లు పరుగులు పెడుతున్నారు. తమకు పరిచయం ఉన్నవారిని కూడా రంగంలోకి దింపి ప్రచారం చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియాను మేనేజ్ చేస్తున్నారు. మరికొందరు మేధావులను కలిసి.. వారి సూచనలు, సలహాలు తీసుకుని ఆమేరకు ప్రచారం చేస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే.. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న అభ్యర్థుల కంటే కూడా.. వారి కోసం ప్రచారానికి వచ్చిన మంత్రుల హడావుడే ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి కారణం.. తమ పదవులేనని చూచాయగా బయట పడుతున్నారు. ''మాకు టార్గెట్లు పెట్టారు. గెలిపించకపోతే.. ముందు మా పదవి పోయేలా ఉంది'' అని ఒక మంత్రి అనధికారికంగా మీడియాకు చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరిని కొనసాగించాలి? ఎవరిని వద్దు? అనేది పార్లమెంటు ఎన్నికల తర్వాత.. నిర్ణయించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈ విషయంలో రేవంత్ నిర్ణయం తీసుకుంటారా? లేక కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందా? అనేది పక్కన పెడితే.. మొత్తానికి పార్లమెంటు ఎన్నికల ఫలితం తర్వాత.. మంత్రుల గ్రాఫ్‌ను పరిగణనలోకి తీసుకోనున్నారనే నిజమని తెలుస్తోంది.
దీంతో పొన్న ప్రభాకర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు సహా.. అందరూ కూడా ఇప్పుడు ఫీల్డ్‌లోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పక్షాన పోరాటం చేస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే.. అభ్యర్థుల కంటే కూడా వీరే ముందుకు దూసుకుపోతున్నారు. చిత్రం ఏంటంటే.. వీరి పనితీరును పర్యవేక్షించేందుకు.. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారట. అంటే.. క్షేత్రస్థాయిలో మంత్రులు ఎలా ప్రచారం చేస్తున్నారు? వారి వ్యూహాలు ఏంటి? ప్రత్యర్థుల వ్యూహాలను ఎలా పసి గడుతున్నారనే విషయాలను ఎప్పటికప్పుడు అంచనా వేయడంతోపాటు.. మంత్రుల ప్రచార శైలిని కూడా.. అధిష్టానం నియమించిన కమిటీ సమీక్ష చేస్తోంది. వీరి రిపోర్టుల ఆధారంగానే మంత్రులను కొనసాగించడమా? తప్పించడమా? అనేది చూస్తారట. ప్రస్తుతం ఈ విషయం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా హల్చల్ చేస్తోంది.