రాహుల్ దగ్గర రేవంత్ కున్న ఇమేజ్ అంత ఎక్కువట!
రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎంత నమ్మకం? అన్న ప్రశ్నకు అనూహ్య రీతిలో సమాధానం దొరికేసింది.
రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎంత నమ్మకం? అన్న ప్రశ్నకు అనూహ్య రీతిలో సమాధానం దొరికేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అప్పజెప్పేందుకు ఇసుమంత కూడా ఆలోచించకుండా కాంగ్రెస్ అధిష్ఠానం ఓకే చెప్పేసినప్పటికి.. పార్టీకి చెందిన నేతల్లో మాత్రం ఏకాభిప్రాయం రాని వేళ.. ఢిల్లీ సాక్షిగా చోటు చేసుకున్న పరిణామం అందరిని ఆశ్చర్యపరిచేలా చేయటమే కాదు.. రేవంత్ ఇష్యూను టచ్ చేయకపోవటమే మంచిదన్న భావన కలిగేలా చేసిందంటున్నారు.
రేవంత్ ను ముఖ్యమంత్రిగా ఒప్పుకోలేమని.. తమకు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టేక్ కావాలన్న డిమాండ్ తో ఢిల్లీకి వెళ్లిన భట్టి.. ఉత్తమ్.. శ్రీధర్ బాబు లాంటి సోకాల్డ్ సీనియర్ నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రీతిలో కాంగ్రెస్ అధినాయకత్వంలోని కీలక నేత రాహుల్ గాంధీ రియాక్టు అయినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని చర్చించేందుకు రాహుల్ తో భేటీకి సిద్ధమైన వేళ.. సీనియర్ నేతలు చాలానే ఆశలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు.
రాహుల్ తో చాలానే మాట్లాడాలని ప్రిపేర్ అయిన వారి ఆశల మీద బిందెడు నీళ్లు పోసేసి.. కేవలం రెండంటే రెండు నిమిషాలు మాత్రమే టైం ఇచ్చి.. రేవంత్ ను ముఖ్యమంత్రిగా ఇప్పటికే అనుకున్నాం కదా? ఇంకేంటి? అనేయటం.. ఆ పని అయ్యేలా చూడండన్న ఆర్డర్ వేసి వెళ్లిపోవటంతో మిగిలిన వారి నోట మాట రాలేదంటున్నారు. రాహుల్ నోటి నుంచి మాట వచ్చిన తర్వాత అది జరగకుండా ఉంటుందా? అయితే.. తమ డిమాండ్లపై కాసింత బేరసారాలు ఆడేందుకు ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు.
చివరకు వాడిన ముఖాలతో వేణుగోపాల్ తదితర ముఖ్యనేతలతో కలిసి వేదికను పంచుకొని మీడియా ప్రెస్ మీట్ లో పాల్గొన్న వారి చెంతనే.. తెలంగాణ సీఎల్పీ నాయకుడిగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్లుగా ప్రకటించటం ద్వారా.. తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న విషయం అధికారికంగా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ తో అందరికి అర్థమైన విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం వద్ద రేవంత్ రెడ్డికి ఉన్న ఇమేజ్ మామూలుగా లేదన్న విషయం స్పష్టమైందంటున్నారు. రేవంత్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించటానికి ముందే ఇలాంటి సీన్లు చోటుచేసుకోవటం ద్వారా.. తొందరపాటుతో వ్యవహరించే ధైర్యం చేయలేరన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. రేవంత్ విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం దేనికైనా సిద్ధమన్న సంకేతాల్ని స్పష్టంగా ఇచ్చేసినట్లేనని చెప్పాలి.