రేవంత్ ఇలా నరుక్కొచ్చాడే !

ఏడు నెలలుగా వేచిచూసిన సీఎం రేవంత్ ఆ అధికారి పెత్తనానికి పరిమితులు విధిస్తూ అటు నుండి నరుక్కురావడం ఇఫ్పుడు చర్చానీయాంశంగా మారింది.

Update: 2024-07-23 04:04 GMT

కాంగ్రెస్ సర్కారులో ఓ అధికారి వ్యవహారం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిల మధ్య దూరం పెంచుతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత పదేళ్లుగా ఆర్థికశాఖలో కీలకపాత్రలో ఉన్న అధికారిని కదిలించవద్దని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పట్టుబడుతున్నాడు. ఏడు నెలలుగా వేచిచూసిన సీఎం రేవంత్ ఆ అధికారి పెత్తనానికి పరిమితులు విధిస్తూ అటు నుండి నరుక్కురావడం ఇఫ్పుడు చర్చానీయాంశంగా మారింది.

తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు పదేళ్లుగా పనిచేస్తున్నాడు. ఆ ప్రభుత్వంలో కీలకశాఖలలో పనిచేసిన అధికారులను పక్కకు తప్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ భావించినా పలు శాఖలలో ఉన్న చిక్కుల నేపథ్యంలో వారిని తప్పించలేని పరిస్థితి నెలకొంది. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుకు రుణమాఫీ, రైతుబంధు, రైతుభీమాలపై అవగాహన ఉంది. ఆయనను తప్పిస్తే గందరగోళం చెలరేగుతుందని ఆయనను కొనసాగిస్తున్నారు. పారిశ్రామిక విధానంపై జయేశ్ రంజన్ కు పట్టుంది. అందుకే ఆయనను తప్పించలేకపోయారు. ఆయనతో రేవంత్ దావోస్ కూడా వెళ్లివచ్చాడు.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, ఇతర ఆర్ధిక అంశాలపై రామకృష్ణారావుకు అవగాహన ఉందని, అవన్నీ ఒక కొలిక్కి వచ్చే వరకు ఆయననే ఆర్ధిక శాఖ కార్యదర్శిగా కొనసాగించాలన్నది ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వాదన. అయితే కొన్నాళ్లుగా ఈ విషయం గురించి వదిలేసిన సీఎం రేవంత్ తాజాగా ఆర్థికశాఖలోని 9 విభాగాలను ఒకరికి, మరో 13 విభాగాలను మరొకరికి కట్టబెడుతూ ఉత్తర్వులు జారీచేశారు.

తాను చెప్పిన అధికారికి తనకు తెలియకుండా అధికారాల్లో కోత విధించడం ఏంటని మల్లు భట్టి విక్రమార్క సీరియస్ అయినట్లు తెలుస్తుంది. అయితే రామకృష్ణారావుకు ఇటీవల గుండె శస్త్రచికిత్స జరిగిందని, అన్ని శాఖల బాధ్యతలను నిర్వహించడంలో వత్తిడి ఎదుర్కొంటున్నారని రేవంత్ తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివరించినట్లు తెలుస్తుంది. ఏది ఎలా ఉన్నా ఈ అధికారాల్లో కత్తెర వ్యవహారం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిల మధ్య దూరం పెంచిందని, సీఎం హోదాలో రేవంత్ వ్యూహాత్మకంగా ఆర్థిక శాఖ కార్యదర్శి అధికారాలకు కత్తెర వేయడం భట్టి జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

Tags:    

Similar News