వారిద్దరిలో.. ప్రజా క్షేత్రంలోకి ముందు దూకేది ఎవరో?

అటు రేవంత్ గానీ ఇటు కేసీఆర్ గానీ.. లోక్ సభ ఎన్నికల నాటికి సంసిద్ధంగా ఉండేలా ప్రణాళికలు వేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

Update: 2024-01-09 12:30 GMT

తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసి.. కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు దాటింది.. ఇక మిగిలింది పాలన వ్యవహారాలను కొత్త సర్కారుకు అనుగుణంగా మార్చుకోవడమే. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అయితే, పొరుగునున్న ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు- లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. 2018లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ముందస్తుగా ఎన్నికలకు వెళ్లడంతో తెలంగాణలో మాత్రం అసెంబ్లీ ఎన్నికలు ఆరు నెలలు ముందుకు జరిగాయి. ఇక దేశవ్యాప్తంగానూ లోక్ సభ ఎన్నికలు 2024లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

బయటకు వచ్చేదెవరో?

వచ్చే లోక్ సభ ఎన్నికలకు తెలంగాణలో ప్రజా క్షేత్రంలోకి ముందుగా వచ్చే నాయకుడు ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నెల రోజుల పరిపాలనను పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి త్వరలో జిల్లాల పర్యటనకు వెళ్తానని చెబుతున్నారు. ఇప్పటివరకు అయితే ఆయన సీఎం హోదాలో ఏ జిల్లాలోనూ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. సొంత నియోజకవర్గం కొడంగల్ కూ వెళ్లలేదు. మరోవైపు రేవంత్.. మంత్రి వర్గ విస్తరణ కూడా చేపట్టాల్సి ఉంది. నామినేటెడ్ పదవులనూ భర్తీ చేయాల్సి ఉంది. ఈ రెండు అంశాల్లోనూ అధిష్ఠానంతో సంప్రదింపుల్లో ఉన్నారు. దీనికితోడు కొత్త సర్కారుకు అవసరమైన అధికారుల నియామకాలు చేపడుతున్నారు. ఇక మిగిలింది జిల్లా పర్యటనే..

26 తర్వాత జిల్లాలకు..

ముఖ్యమంత్రి హోదాలో జిల్లాలకు వెళ్లేది ఎప్పుడో సీఎం రేవంత్ సోమవారం ప్రకటించారు. ముఖ్యమంత్రిగా తొలి సభ ఇంద్రవెల్లిలో నిర్వహించనున్నట్లు చెప్పారు. అక్కడ 'అమరుల స్మృతివనం' ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు. అంటే.. సీఎంగా ఆయన మొదటి జిల్లా కార్యక్రమాన్ని తెలంగాణ కశ్మీర్ ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి చేపట్టనున్నట్లు స్పష్టమవుతోంది.

కేసీఆర్ కాలు బయటపెట్టేది ఫిబ్రవరిలో..

డిసెంబరు 3న ఫలితాల అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పటివరకు నివాసం ఉన్న ప్రగతి భవన్ ను ఖాళీ చేసి ఎర్రవెల్లిలోని ఫాం హౌస్ కు వెళ్లిపోయిన సంగతి తెలసిందే. అయితే, అక్కడ అనూహ్యంగా ఆయన గాయపడ్డారు. తుంటి ఎముక విరగడంతో శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్ నందినగర్ లోని ఇంటిలో ఉంటున్నారు. కాగా, కేసీఆర్ కోలుకుంటున్నారని.. ఆయన త్వరలో ప్రజల ముందుకు వస్తారని బీఆర్ఎస్ ముఖ్య నేతలు పలుసార్లు ప్రకటించారు. మరీ ముఖ్యంగా.. కేసీఆర్ ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటన చేపడతారని స్పష్టంగా చెప్పారు.

ఎన్నికల నాటికి సంసిద్ధం..

అటు రేవంత్ గానీ ఇటు కేసీఆర్ గానీ.. లోక్ సభ ఎన్నికల నాటికి సంసిద్ధంగా ఉండేలా ప్రణాళికలు వేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఏర్పడేందుకు రేవంత్ ప్రయత్నించనున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని మరిపించేందుకు, కేడర్ ను కదిలించేందుకు, జాతీయ స్థాయిలో కాలం కలిసివస్తే తనదైన పాత్ర పోషించేందుకు కేసీఆర్ లోక్ సభ ఎన్నికలను అవకాశంగా మలుచుకోనున్నారు.

Tags:    

Similar News