అప్పుల విషయంలో మోడీ ఖ్యాతిని వివరిస్తున్న రేవంత్... కీలక వ్యాఖ్యలు!
అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆరెస్స్, గతంలో టీడీపీ కూడా మోడీ & కో పై ఈ తరహా ఆరోపణలు బలంగా చేశాయి.
కేంద్రంలో బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కేంద్రప్రభుత్వ దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించడానికి వాడుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆరెస్స్, గతంలో టీడీపీ కూడా మోడీ & కో పై ఈ తరహా ఆరోపణలు బలంగా చేశాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకొని, కొందరికే లబ్ధి చేకూరేలా ప్రధాని మొడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఈ సందర్భంగా దేశంలోని అన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ గురువారం ఆందోళనలు చేపట్టింది.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా దేశానికి రూ.183 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని అన్నారు. ఇదే క్రమంలో... 16 మంది ప్రధానులు చేసిన అప్పులకంటే.. నరేంద్ర మోడీ రెండింతలు ఎక్కువ అప్పులు చేశారని విమర్శించారు.
ఇదే క్రమంలో... దేశాన్ని మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీ చెరబట్టారని.. సెబీ ఛైర్ పర్సన్ అక్రమాలపై విచారణ జరపాలని.. వర్సిటీలు, ప్రాజెక్టులను మొదలుపెట్టిన దార్శనిక ప్రధాని నెహ్రూ అని.. భూసంస్కరణలు ప్రవేశపెట్టి బలహీనవర్గాలకు భూములు పంచిన ప్రధాని ఇందిరాగాంధీ అని కొనియాడారు.
ఇదే క్రమంలో... రాజీవ్ గాంధీ తెచ్చిన సాంకేతిక విప్లవం వల్లే ఐటీ అభివృద్ధి సాధ్యమైందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరోపక్క... నరేంద్ర మోడీ మాత్రం వాట్సప్ యూనివర్సిటీ పెట్టి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల సమయంలో మోడీ వ్యాఖ్యలను గుర్తుచేశారు.
ఇందులో భాగంగా... బీజేపీకి 400 పార్లమెంట్ స్థానాలు వస్తాయని మోడీ అన్నారని చెప్పిన రేవంత్... కానీ 240 సీట్లకు మించవని తాను ఆరోజే చెప్పానని గుర్తు చేశారు. ఇదే సమయంలో... తాను చెప్పినట్లే బీజేపీకి సీట్లు రావడంతో పాటు బీఆరెస్స్ కి ఒక్క లోక్ సభ స్థానం కూడా రాదని చెప్పినట్లు జరిగిందని చెప్పుకొచ్చారు.