సీఎం రేవంత్ తో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. స్పెషల్ ఇదే!

తాజాగా సీఎం రేవంత్ తో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర తోట భేటీ కావటమే కాదు.. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.

Update: 2024-01-12 03:38 GMT

గతానికి భిన్నమైన పరిస్థితులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో విజయాన్ని సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ సర్కారు నెల రోజులు పూర్తి చేయటంతో పాటు.. ఈ నెలలో కుదురుకోవటమే కాదు.. స్థిరపడే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు తగ్గట్లే.. పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రిని నేరుగా కలుస్తున్న పరిస్థితి. గతంలో ఎంతో ప్రముఖులు మాత్రమే సీఎంను కలిసే పరిస్థితి ఉండగా.. అందుకు భిన్నమైన వాతావరణాన్ని తాజాగా దర్శనమిస్తోంది. పలు రంగాలకు చెందిన ప్రముఖులు నేరుగా ముఖ్యమంత్రితో భేటీ కావటం.. తెలంగాణలో పెట్టుబడుల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.

తాజాగా ఒక్కరోజులోనే పలువురు ప్రముఖులు సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి తమ వంతుగా చేసే అంశాలపై చర్చలు జరిపారు. తాజాగా సీఎం రేవంత్ తో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర తోట భేటీ కావటమే కాదు.. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ప్రతి రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేస్తోందని.. తెలంగాణలో వ్యవసాయం.. విద్య.. ఆరోగ్యం లాంటి రంగాల డిజిటలీకరణలో భాగస్వామ్యం అవుతామని చెప్పిన ఆయన మాటలకు సీఎం సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా గూగుల్ ఎర్త్ .. గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగించి రహదారి భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎంతో చర్చించారు. ఇక.. అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీకి చెందిన అధ్యాపకుల టీం సీఎంను కలిశారు. ఉస్మానియా వర్సిటీలో నిర్వహించే కార్యక్రమం గురించి ముఖ్యమంత్రికి వివరించారు. వారు చేపట్టే కార్యక్రమాల గురించి సీఎంతో చర్చించారు. ఇక.. మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్ కం సీఈవో సంజయ్ మెహ్రోత్రా కూడా సీఎంతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు.. పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఉందన్న ఆయన.. తమ సంస్థ పెట్టుబడులు పెట్టనున్నట్లుగా పేర్కొన్నారు.

అమెరికాకు చెందిన ఈ సంస్థ.. సెమీ కండక్టర్ల తయారీలో ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద సంస్థ కావటం గమనార్హం. మెమరీ చిప్ తయారు చేసే అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా సుపరిచితం.

ఇక..ముఖ్యమంత్రితో భేటీ అయిన ఇతర ప్రముఖుల్లో ప్రముఖ క్యాన్సర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు.. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత అరుణ్ తివారీ.. అమెరికాలోని పీఐ హెల్త్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ వినాయక చింతపల్లి తదితరులతో భేటీ అయ్యారు. ఒకరోజులో ఇన్ని రంగాలకు చెందిన వారితో సీఎం భేటీ కావటం ద్వారా.. సానుకూల సంకేతాల్ని ఇస్తున్నట్లుగా చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే.. మొదటి నెలతో పోలిస్తే.. రెండో నెలలో మరింత వేగంగా.. స్థిరంగా సీఎం రేవంత్ సర్కారు కుదురుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News