వెతికి.. వెతికి.. న్యాయం చేయాల‌ని.. సీఎం రేవంత్ ఆరాటం!!

న్యాయం చేయ‌డం అంటే.. ప్ర‌స్తుత కాలంలో ఎంతో క‌ష్టం! అందునా..మ‌న అనుకున్న‌వారు కాక‌పోతే.. న్యాయం అంద‌డం మ‌రింత క‌ష్టం.

Update: 2023-12-16 03:42 GMT

న్యాయం చేయ‌డం అంటే.. ప్ర‌స్తుత కాలంలో ఎంతో క‌ష్టం! అందునా..మ‌న అనుకున్న‌వారు కాక‌పోతే.. న్యాయం అంద‌డం మ‌రింత క‌ష్టం. కానీ, ఎవ‌రికైతే అన్యాయం జ‌రిగిందో.. ముఖ్యంగా తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఎవ‌రైతే అన్యాయ‌మయ్యారో.. అలాంటి వారిని వెతికి ప‌ట్టుకుని మ‌రీ న్యాయం చేయాల‌న్న స్పృహ ఉండ‌డం నిజంగా అభినంద‌నీయం. ఇప్పుడు ఇదే ప‌నిచేస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ మలిపోరులో ఉధృతంగా ఉద్యమించిన ఆడపడుచుకు ఆయ‌న బాస‌ట‌గా నిలిచారు.

తెలంగాణ ఉద్యమ కారులకు అండగా నిలబడాలనే ఉద్వేగం.. తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేస్తున్న అక్కాతమ్ముళ్లపై లాఠీ ఝుళిపించలేననే భావోద్వేగం వెర‌సి.. ఎంతో క‌ష్టించి సాధించిన‌ త‌న ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా త్య‌జించారు.. మాజీ డిఎస్పీ నళిని. అంతేకాదు.. ‘నా రాష్ట్రం వచ్చాకే నేను ఉద్యోగం చేస్తా' అని ప్రతిజ్ఞ చేసి డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి కేంద్రానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలంగా చాటారు.

డిసెంబర్ 9న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అధికారిక ప్రకటన చేసిన తరువాత.. ఆమె తిరిగి డీఎస్పీగా ఉద్యోగంలో చేరారు. అయితే.. ఏళ్లు గడుస్తున్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయకపోవటాన్ని నిరసిస్తూ, రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ 22 పేజీలతో సోనియాగాంధీకి, 9 పేజీలతో కిరణకుమార్రెడ్డికి లేఖ రాసి 2012 నవంబర్1న మరోమారు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఆ త‌ర్వాత‌.. తెలంగాణ సాకార‌మైంది. కానీ, న‌ళిని గురించి.. ఆమె స్ఫూర్తి గురించి ప‌ట్టించుకున్న నాథుడు లేకుండా పోయారు. ప‌దేళ్లు పాలించిన కేసీఆర్ ప్ర‌భుత్వం కూడా న‌ళిని గురించి ఆరా తీయ‌లేదు. కానీ, తాజాగా అధికారం చేప‌ట్టి ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా నిండ‌కుండానే.. సీఎం రేవంత్‌రెడ్డి న‌ళిని పేరును గుర్తు పెట్టుకుని మ‌రీ ఆమెను న్యాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. పోలీసు శాఖ నిబంధనలు అనుమతిస్తే... నళినిని తిరిగి డిఎస్పీగా నియమించాలని, లేకపోతే అందుకు సమానమైన పోస్టును ఇచ్చే ప్రయత్నం చేయాలని సీఎం ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. సీఎం రేవంత్ ఆదేశాల‌పై స్పందించిన న‌ళిని.. ప్ర‌స్తుతం తాను పోలీసు ఉద్యోగానికి ఫిట్ కాన‌ని వ్యాఖ్యానించారు. దీంతో ఆమెకు మ‌రో పోస్టును ఇచ్చే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News