తెలుగు రాష్ట్రాల సభలు సమా'వేషాలు'!
గత వైసీపీ సర్కారు చేసిన తప్పులను ఈ సందర్భంగా సోదాహరణంగా వివరించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఏపీలో బడ్జెట్ సమావేశాల పేరుతో శ్వేత పత్రాల సమావేశాలు నిర్వ హించారనేది వాస్తవం. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని.. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు మరో రెండు మాసాల సమయం పడుతుందన్న సీఎం చంద్రబాబు.. ఐదు రోజుల సభల్లో కేవలం వైసీపీ తప్పులను ఎత్తి చూపించేందుకు మాత్రమే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే ఏడు శ్వేతపత్రాలను విడుదల చేశారు. దీనిలో కీలకమైన లిక్కర్, ఆర్థిక శాఖ, మైనింగ్, ఇసుక, విద్యుత్ వంటివి ఉన్నాయి. గత వైసీపీ సర్కారు చేసిన తప్పులను ఈ సందర్భంగా సోదాహరణంగా వివరించారు.
ఇక, వైసీపీ ఈ సభలకు తొలిరోజు వెళ్లి మలి రోజు నుంచి చివరి వరకు డుమ్మా కొట్టింది. ఢిల్లీలో ధర్నా, తాడేపల్లిలో ప్రెస్ మీట్ వంటివాటితో వైసీపీ అధినేత జగన్ సరిపుచ్చారు. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు రాలేమని కూడా చెప్పేశారు. మొత్తంగా బడ్జెట్ సమావేశాల్లో 4 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు అంచనా. ఎమ్మెల్యేల అలవెన్సులు, విద్యుత్ ఖర్చు, వాహనాల ఖర్చు, భద్రతా ఖర్చులు కలుపుకొని 4 కోట్ల రూపాయలు అయిందని లెక్కగట్టారు. కానీ, ఫలితం మాత్రం శ్వేత పత్రాల ద్వారా వైసీపీ హయాంలో జరిగిన తప్పులను ఎత్తి చూపించేందుకు మాత్రమే సభలను పరిమితం చేశారు.
ఇక, తెలంగాణ సమావేశాలను గమనిస్తే.. మాటకు మాట! అన్నట్టుగానే సాగాయి. సభలో 117 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. కేవలం సీఎం రేవంత్ రెడ్డి, ఒకరిద్దరు మంత్రులు, ఇటు వైపు బీఆర్ ఎస్ పార్టీ నుంచి హరీష్‌రావు, కేటీఆర్, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ వంటివారు మాత్రమే సభలో పదే పదే మాట్లాడారు. అది కూడా సవాళ్లు రువ్వుకోవడానికి.. తప్పులు ఎంచుకోవడా నికి..ఒకరిపై ఒకరు నిందలు వేసుకునేందుకు, వచ్చే ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకునేందుకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. ఇదే విషయం ఎమ్మెల్యేల మధ్య కూడా చర్చకు దారితీసింది.
తాము ఎన్నో సమస్యలతో సభలోకి వచ్చామని.. కానీ, ఒక్క అంశాన్నీ ప్రస్తావించేందుకు మైకు దక్కలేదని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వాస్తవమే. సభలో సభ్యుల్లో 95 శాతం మందికి మైకు ఇవ్వలేక పోయామన్నది రికార్డులే చెబుతున్నాయి. మరోవైపు సభలో బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇది మాత్రం కొంత ఉపశమనం కల్పించే విషయమనే చెప్పాలి. పార్లమెంటు ఎన్నికలకు ముందు కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టింది. ఇది పక్కన పెడితే.. సభ్యులకు మాత్రం అవకాశం దక్కలేదు. మొత్తంగా చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ సామాన్యుల సమస్యలపై మాత్రం చర్చించకపోవడం గమనార్హం.