కేంద్రంలో కాంగ్రెస్ సర్కారుకు రేవంత్ అందించే సీట్లెన్ని?

పదేళ్లవుతోంది.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారానికి దూరమై. ఈ వ్యవధిలో బీజేపీ చేతిలో ఎన్నో దెబ్బలు తిన్నది

Update: 2023-12-25 10:42 GMT

పదేళ్లవుతోంది.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారానికి దూరమై. ఈ వ్యవధిలో బీజేపీ చేతిలో ఎన్నో దెబ్బలు తిన్నది. మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ధాటికి ఓ దశలో కోలుకోలేనంతగా నష్టపోయింది. కానీ, ఈసారి తప్పక గెలవాల్సిన పరిస్థితి. 1998-2004 మధ్యన వరుసగా ఆరేళ్లు పైగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంది కాంగ్రెస్. అప్పటివరకు అదే సుదీర్ఘ వ్యవధి. కానీ, ఈసారి మాత్రం పదేళ్లు అవుతోంది. గతంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రధానులుగా చేసిన నాయకుల్లో వాజపేయీ మాత్రమే బలమైనవారు. చివర్లో ఆయన వయసు పైబడి క్రియాశీలంగా లేరు. ఇప్పుడు మాత్రం అలా కాదు. మోదీ వంటి బలమైన నాయకుడు. ఆరోగ్యంగా ఉన్న నాయకుడిని ఎదుర్కొనాల్సి వస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే వాజపేయీ కంటే మోదీనే శక్తిమంతమైన నేత.

ఈ సారి కొట్టకుంటే..

ఈసారి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాకుంటే పరిస్థితి మరింత ఇబ్బందిగా మారుతుంది. మోదీ మూడోసారి ప్రధాని అవుతారా? కాదా? అనేది పక్కనపెడితే.. మరో ఐదేళ్ల వరకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మనుగడ, పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. దీనిని నివారించేందుకే ఇండియా కూటమి అంటూ ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక మోదీ మూడోసారి గెలిచి ప్రధానిగా అయిదేళ్లు కొనసాగితే 2029 నాటికి పరిస్థితులు చాలా మారతాయి. దీనిని నివారించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైనే ఉంది.

అప్పట్లో ఉమ్మడి ఏపీనే కీలకం

1998-2004 మధ్యన కేంద్రంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ 2004 నాటికి బలీయ శక్తిగా తిరిగొచ్చిందంటే దానికి కారణం ఉమ్మడి ఏపీనే. కాంగ్రెస్ కు 2004లో 34 సీట్లు (నాటి టీఆర్ఎస్, వామపక్షాలతో కలిపి), 2009లో సొంతంగా 33 సీట్లను అందించింది ఉమ్మడి రాష్ట్రం. రాష్ట్ర విభజన తర్వాత ఈ పరిస్థితి లేకపోయింది. తెలంగాణలో 2014లో 2 సీట్లు, 2019లో మూడు సీట్లకు పరిమితమైంది. ఇక ఏపీ గురించి చెప్పేదేముంది? అక్కడ అసెంబ్లీ ఒక్క అసెంబ్లీ సీటు కూడా నెగ్గలేదు. ఇక లోక్ సభ సంగతి చెప్పాల్సిన పని లేదు.

ఈసారి రేవంత్ దే బాధ్యత

తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించడంలో సీఎం రేవంత్ రెడ్డిది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో 17 లోక్ సభ సీట్లుండగా.. హైదరాబాద్ మినహా 16లో ఎన్ని ఎక్కువ గెలిపిస్తే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు అంత చేయూత అవుతుందనడంలో సందేహం లేదు. అందులోనూ ఇటీవల తెలంగాణ మినహా మిగతా మూడు కీలక రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. పరాజయ భారంలో అక్కడ పెద్దగా లోక్ సభ సీట్లు వస్తాయని చెప్పలేం. అంటే.. కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు రావాలంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిదే ముఖ్య భూమిక అని చెప్పాల్సిన పనిలేదు.

కనీసం 15 సాధిస్తే ఢిల్లీలో పలుకుబడి

తెలంగాణ నుంచి కాంగ్రెస్ కనీసం 15 లోక్ సభ సీట్లు సాధించి ఇస్తే రేవంత్ కు ఢిల్లీలో పలుకుబడి పెరుగుతుంది. సీఎంగా ఆయన స్థానం మరింత పదిలం అవుతుంది. వైఎస్ తర్వాత నేరుగా కాంగ్రెస్ అధిష్ఠానం ద్వారా సీఎంగా నియమితులైన రేవంత్ రెడ్డి.. దానికి బహుమతిగా ఓ మాజీ ఎంపీగా, ఎన్ని లోక సభ స్థానాలను తన పార్టీకి అందిస్తారో చూడాలి.

Tags:    

Similar News