Begin typing your search above and press return to search.

'కోటి'కొక్కరుగా నిలిచింది!

ఈ దీప్తి ఎందరికో స్ఫూర్తి పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో తెలంగాణలోని వరంగల్ జిల్లా పర్వతగిరి మండ లం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజి కూడా పాల్గొంది.

By:  Tupaki Desk   |   8 Sep 2024 9:05 AM GMT
కోటికొక్కరుగా నిలిచింది!
X

అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించడం అంటే అంత సులువు కాదు.. ఇక శారీరక వైక్యలం ఉంటే మరీ కష్టం.. ఇలాంటివారి కోసమే నిర్వహించేవి పారాలింపిక్స్.. ఇక్కడ పోటీ ఏమీ తక్కువగా ఉండదు.. ఇలాంటివాటిలో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. అసలు ఒలింపిక్స్ అయిన వేసవి ఒలింపిక్స్ లో కంటే పారాలింపిక్స్ లోనే భారత్ కు ఎక్కువ పతకాలు వస్తున్నాయి. అద్భుత ప్రతిభ చాటిన వారిలో తెలుగమ్మాయి ఒకరు ఉన్నారు. ఆమె నేపథ్యం తెలుసుకుంటే.. అవమానాల నుంచి చాంపియన్ గా ఎదిగిందని తెలుస్తోంది.

ఈ దీప్తి ఎందరికో స్ఫూర్తి పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో తెలంగాణలోని వరంగల్ జిల్లా పర్వతగిరి మండ లం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజి కూడా పాల్గొంది. 400 మీటర్ల మహిళ టి20 ఈవెంట్ లో దీప్తి మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. కాగా, దీప్తి పుట్టుకతోనే మానసిక సమస్యలను ఎదుర్కొంది. గ్రహణ మొర్రితో బాధపడుతోంది. వీరిది పేద కుటుంబం. దీంతో అథ్లెటిక్స్ పై ఇష్టం ఉన్నా ముందుకెళ్లడం కష్టం మారింది. అలాంటి సమయంలో దాతల ప్రోత్సాహంతో పారాలింపిక్స్ స్థాయికి చేరింది. తొలిసారి పోటీల్లో పాల్గొంటూనే పతకం సాధించింది.

ట్రాక్ లో చిరుత..దీప్తి పరుగులో చిరుతనే అని చెప్పాలి. పారాలింపిక్స్ లో 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో ఆమె ఎవరు? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. కాగా, దీప్తి తల్లిదండ్రులు యాదగిరి-ధనలక్ష్మి. వీరిద్దరూ వ్యవసాయ కూలీలు. రోజూ పనికి వెళ్తే కానీ.. పూట గడవని పరిస్థితి. యాదగిరి-ధనలక్ష్మిలది మేనరిక వివాహం. కాగా, దీప్తి గ్రహణం మొర్రితో పుట్టింది. సర్జరీలు చేసినా.. అవి తొలగలేదు. వీటికితోడు ఆమెకు మానసిక ఎదుగుదల లోపం ఉంది. అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. బాల్యం ఐక్యూ (ఇంటలిజెన్స్ కోషియంట్) సమస్యతో బాధ పడుతోంది.

ఎగతాళి చేసినవారే కరతాళ ధ్వనులు గ్రహణం మొర్రి కారణంగా దీప్తిని కోతి పిల్ల, కోతి ముఖం అని ఎగతాళి చేసేవారు. ఈ మానసిక క్షోభ కారణంగా ఏమో..? దీప్తి చదువు ముందుకుసాగలేదు. అయితే, క్రీడల్లో ఆమెకు చాలా ఆసక్తి ఉండడంతో కల్లెడ ఆర్డీఎఫ్ పాఠశాల అండగా నిలిచింది. పరుగులో దీప్తి వేగం చూసిన పీఈటీ ఆమెను జిల్లా స్థాయి పోటీలకు తీసుకొచ్చారు. హనుమకొండలో జరిగిన ఈ పోటీలను అంతర్జాతీయ అథ్లెటిక్స్ కోచ్, ద్రోణాచార్య పురస్కార గ్రహీత నాగపురి రమేశ్ చూడడంతో దీప్తి జాతకం మారిపోయింది. అయితే, కనీసం బూట్లు కొనే పరిస్థితిలో హైదరాబాద్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో దీప్తి పాల్గొనడం గమనార్హం. నాగపురి రమేశ్‌ తో పాటు కల్లెడ ఆర్డీఎఫ్ నిర్వాహకులు నెలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించడం, బ్యాడ్మింటన్ కోచ్

పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ దీప్తిని అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా చేశాయి. కాగా, దీప్తికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.కోటి నజరానా ప్రకటించడం విశేషం. అంతేగాక ఆమెకు గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వనున్నారు.