పండగపూట సొంతూర్లో సీఎం సందడి... కార్యక్రమాలివే!
ఈ పండగ పూట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
ఈ పండగ పూట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఆయన నేడు సొంతూరుకు బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. ఇదే క్రమంలో తన సొంతూరులో రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
అవును... తొలిసారిగా సీఎం హోదాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరుకు బయలుదేరనున్నారు. నాగార్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డి పల్లి.. రేవంత్ రెడ్డి స్వగ్రామం. అయితే... ఈసారి దసరా పండగ వేడుకలు అక్కడే జరుపుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి శనివారం సాయంత్రం ప్రత్యేక హెలీకాప్టర్ లో బయలుదేరి.. కొండారెడ్డిపల్లికి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. అక్కడే గ్రామస్తులందరితో కలిసి దసరా వేడుకలు జరుపుకుంటారు! ఇదే సమయంలో... కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు.
ఇందులో భాగంగా... గ్రామ పంచాయతీ, పశువైద్యశాల, బీసీ భవనం, గ్రంథాలయంలను ప్రారంభిస్తారు. ఇదే సమయంలొ... తన స్వగ్రామంలో ప్రతీ ఇంటికీ సోలార్ విద్యుత్, నాలుగు లైన్ల రోడ్డు, అండర్ డ్రైనేజ్, చిల్డ్రన్స్ పార్క్, సెంటర్ లైంటింగ్, దేవాలయం, జిమ్.. తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.