సీఎంల ఫ్యాక్టరీ టీడీపీ!..బాబు నుంచి కేసీఆర్, రేవంత్ వరకు!

అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తాన తెలుగు దేశం అంటూ పార్టీని స్థాపించారో కానీ.. 9 నెలల్లోనే అధికారం సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

Update: 2023-12-04 07:15 GMT

అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తాన తెలుగు దేశం అంటూ పార్టీని స్థాపించారో కానీ.. 9 నెలల్లోనే అధికారం సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అనేక మంది యువతకు ఆ పార్టీ ఓ రాజకీయ వేదికైంది. పాతికేళ్ల ప్రాయంలోని వారు ఎమ్మెల్యేలయ్యారు. 30 ఏళ్ల వయసు వారు ఉమ్మడి ఏపీ అంత పెద్ద రాష్ట్రానికి మంత్రులయ్యారు.. తెలంగాణలో అయితే బీసీలను వెన్నుతట్టి ప్రోత్సహించింది టీడీపీ. దీంతో సామాజిక చైతన్యానికీ పునాది వేసింది ఆ పార్టీ. మరోవైపు టీడీపీ నుంచి ఎదిగిన నాయకత్వం తదనంతరం కాలంలో అనేక పార్టీల్లో కీలక పాత్ర పోషించింది. వీరిలో ముగ్గురు సీఎంలు కూడా కావడం విశేషం.

అప్పట్లో బాబు..

అందరికీ తెలిసిన విషయమే.. టీడీపీ ప్రారంభంలో చంద్రబాబు అ పార్టీలో లేరు.. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. తెలుగుదేశం స్థాపించిన తర్వాత జరిగిన 1983 ఎన్నికల్లోనూ చంద్రబాబు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అనంతరం టీడీపీలోకి వచ్చి.. నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ సందర్భంగా ఎన్టీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచారు. తర్వాత జరిగినందతా చరిత్రే.. పదేళ్లకు, అంటే 1995లో చంద్రబాబు అనూహ్య పరిస్థితుల్లో ఉమ్మడి ఏపీలో సీఎం అయ్యారు. 2004 వరకు కొనసాగారు. విభజిత ఏపీలోనూ 2014-19 మధ్య సీఎంగా చేశారు.

అనంతరం కేసీఆర్

చంద్రబాబు రెండో విడత సీఎం (1999) అయ్యాక ఆయనతో విభేదించి తెలంగాణ వాదంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని స్థాపించి పదేళ్ల పోరాటంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. 1983లో కేసీఆర్ టీడీపీ నుంచే సిద్దిపేట అభ్యర్థిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు .తొలుత ఓడినా 1985 ఎన్నికల్లో విజయంతో వెనక్కుతిరిగి చూసుకోలేదు. మరోవైపు టీఆర్ఎస్ స్థాపించాక కూడా ఆయన సిద్దిపేట ఉప ఎన్నికలో గెలిచారు. అలా 2014లో రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం అయి రెండుసార్లు పదవిలో కొనసాగారు. తొమ్మిదిన్నరేళ్లు ఏకధాటిగా సీఎంగా చేసిన ఏకైక తెలుగు సీఎంగా రికార్డు నెలకొల్పారు. చంద్రబాబు 14 ఏళ్లు దాదాప సీఎంగా ఉన్నా మధ్యలో పదేళ్లు గ్యాప్ వచ్చింది.

ఇప్పుడు రే‘‘వంతు’’

ఏబీవీపీ నేపథ్యం.. టీఆర్ఎస్ ద్వారా రాజకీయ ప్రవేశం.. అన్ని పార్టీల అభ్యర్థిగా జడ్పీటీసీ సభ్యుడిగా విజయం.. ఎమ్మెల్సీగా అనూహ్య గెలుపు.. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా సంచలన విజయం.. ఆపై కాంగ్రెస్ లోకి వచ్చి ఎంపీ.. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు.. బహుశా ఏ రాజకీయ నాయకుడికీ ఇంత భిన్న నేపథ్యం ఉండి ఉండదనుకుంటా. ఇదంతా రేవంత్ రెడ్డి ప్రస్థానం. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఇప్పుడు సీఎం స్థాయికి ఎదిగారు. మరీ ముఖ్యంగా టీడీపీ తరఫున 2009లో ఎమ్మెల్సీ కావడమే ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత టీడీపీ పక్ష నేతగానూ ఎంపికవడంతో హోదా పెరిగింది. టీపీసీసీ అధ్యక్షుడి పదవి సాధనకు ఇది ఓ మెట్టు అయింది. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి సీటే దక్కుతోంది. చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ లను ఉదాహరణగా తీసుకుంటే.. టీడీపీ ఓ ముఖ్యమంత్రుల ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు.

Tags:    

Similar News