ఈఎస్ హైదరాబాద్ పై రేవంత్ దృష్టి
అలాగే, నల్గొండ, వరంగల్ ప్రాంతాలకు కూడా మెరుగైన రవాణా సదుపాయం కలుగుతుంది
గ్రేటర్ హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా మరో కీలక ముందడుగు పడింది. ఎల్బీనగర్ పరిధిలోని బైరామల్ గూడ రెండో లెవల్ ఫ్లై ఓవర్ తో పాటు లూప్ ఫ్లై ఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎస్ఆర్ డీపీ (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం)లో భాగంగా ఈ వంతెనల పనులు పూర్తి చేశారు. దాదాపు రూ.148.05 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పై వంతెన వల్ల.. శంషాబాద్, ఓవైసీ ఆస్పత్రి నుంచి బీఎన్ రెడ్డి నగర్, నాగార్జున సాగర్ వైపు వెళ్లే వాహనాలకు, చింతలకుంట చెక్ పోస్ట్ అండర్ పాస్ మీదుగా హయత్ నగర్, విజయవాడ వైపు వెళ్లే వాహనదారులకు ఉపయోగపడనుంది.
అలాగే, నల్గొండ, వరంగల్ ప్రాంతాలకు కూడా మెరుగైన రవాణా సదుపాయం కలుగుతుంది. ఇదే కూడలిలో ప్రస్తుతం 2 లూప్స్ నిర్మాణంలో ఉండగా పై వంతెన అందుబాటులోకి వచ్చింది. ఫ్లైఓవర్ మొత్తం పొడవు 1786.60 మీటర్లు కాగా.. వయాడక్ట్ భాగం పొడవు 1305.60 మీటర్లు, ర్యాంపుల పొడవు 481 మీటర్లుగా ఉంది. ఈ వంతెన ప్రారంభంతో బైరామల్ గూడ కూడలి సిగ్నల్ ఫ్రీగా మారింది. శంషాబాద్ విమానాశ్రయం, ఓవైసీ ఆస్పత్రి వైపు నుంచి నాగార్జునసాగర్, విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు ఈ పై వంతెన ఉపయోగపడుతుంది. జంక్షన్ లో ఈ వంతెన 'వై' ఆకారంలో విడిపోతుంది. వంతెనకు ఎడమవైపు వెళ్తే చింతలకుంట చెక్ పోస్ట్, కుడి వైపు వెళ్తే బీఎన్ రెడ్డినగర్ రోడ్డుకు కలుస్తాయి. దీంతో హైదరాబాద్ వాసులకు ట్రాఫ్ కష్టాలు తీరనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందిరమ్మ ఇళ్లు కూడా..
రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పథకానికి సంబంధించి పట్టణాల్లో నిర్మించే గృహాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. కేంద్రం అమలు చేస్తోన్న 'అందరికీ ఇళ్లు' పథకం కింద కొంత మేర నిధులు సమీకరించాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం వెలువడనుందని తెలుస్తోంది.