జగన్ చేసిన తప్పు రేవంత్ చేస్తున్నారా ?
గతంలో అయితే ఏమో కానీ వర్తమానంలో మాత్రం రాజకీయాలే పరమార్ధం అయ్యాక విపక్షాలు ఒక వైపే చూస్తున్నాయి.
ఏ ప్రభుత్వం అయినా విజయాలూ ఉంటాయి అపజయాలు ఉంటాయి. ప్రభుత్వం అయిదేళ్ల పాలనలో ఏమీ చేయలేదు అని ఎవరూ అనలేరు. కానీ విపక్షాలు మాత్రం చేయని వాటినే జనాల్లోకి తీసుకెళ్తారు. ప్రభుత్వం మంచి చేస్తే వారు ఎక్కడా చెప్పరు. ఎందుకంటే ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని. దానిని ఇవ్వాలన్న ఉదారత వారికి ఎందుకు ఉంటుంది. గతంలో అయితే ఏమో కానీ వర్తమానంలో మాత్రం రాజకీయాలే పరమార్ధం అయ్యాక విపక్షాలు ఒక వైపే చూస్తున్నాయి.
అది సహజం కూడా. మరి ప్రభుత్వం చేసిన మంచిని ఎవరు చెప్పుకోవాలీ అంటే ప్రభుత్వ పెద్దలే అని అంటున్నారు. నోరు విప్పక ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం తమిళనాడు సీఎం జయలలిత ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలు అయింది. ఆమె విపక్షాలు చేసే విమర్శలకు సమాధానం చెప్పలేదు అని అంటారు. వారి విమర్శలకు జవాబు ఇస్తే విలువ పెంచినట్లు అవుతుందనే ఆమె అలా వ్యవహరించారు అని అంటారు.
అదే తప్పుని చాలా ఏళ్ల తరువాత ఏపీలో జగన్ చేశారు. ఆయన ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోలేకపోయారు. తాము ఫలానా పని చేశామని జనాలకు చెప్పాలి. కానీ వైసీపీ అధినాయకత్వం ప్రజలకు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ఎందుకు చెప్పడం అని ఊరుకుంది. కానీ అది చివరకు బూమరాంగ్ అయింది. అంతే కాదు విపక్షాలు చేసే విమర్శలకు కూడా వైసీపీ నుంచి సమర్ధంగా తిప్పి కొట్టే పరిస్థితి లేకుండా పోయింది.
విపక్షాలకు జవాబు చెప్పడమేంటి అని అనుకున్నారో ఏమో కానీ ఎవరూ పెద్దగా రియాక్ట్ అయిన దాఖలాలు లేవు అని అంటున్నారు. దాని ఫలితం విపక్షాలు చెప్పింది జనాలు నమ్మారు. వారు గెలిచారు. జగన్ ఈ విషయంలో పడినది అపోహ అని తేలిపోయింది. ప్రజలు తనను గుర్తుంచుకుంటారు ఆదరిస్తారు తాము చేసిన కార్యక్రమాలే మాట్లాడుతాయని భావించడం వల్లనే జగన్ క్యాడర్ ని సైతం పట్టించుకోలేదు. అసలు వారిని యాక్టివ్ కూడా చేయలేదు. దాంతో ఫలితం తెలిసిందే కదా.
ఇక ఇపుడు తెలంగాణా వైపు చూస్తే అచ్చం రేవంత్ రెడ్డి కూడా జగన్ చేసిన తప్పులనే చేస్తున్నారా అని అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు అవుతోంది. ఇంకా హానీమూన్ పీరియడ్ లోనే ఉంది అనుకోవాలి. కానీ అధికారం చేపట్టిన తరువాత రోజు నుంచే విమర్శల జడివాన తప్పడం లేదు. ప్రస్తుతం ఎవరూ ఎవరికీ టైం ఇవ్వడం లేదు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు అని జనాల్లోకి వెళ్ళి విపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.
మరి ఆరు నెలల పదవీ కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమీ చేయలేదా అన్న చర్చ వస్తోంది. కేవలం వంద రోజుల వ్యవధిలో మూడు పెద్ద పధకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలులోకి పెట్టింది. ఉచిత బస్సు ప్రయాణం అన్నది రేవంత్ వచ్చిన మరుసటి రోజు నుంచే అమలు అయింది. అలాగే మరో రెండు కీలక హామీలను నెరవేర్చారు. అయినా సరే విపక్షం గొడవ చేస్తోంది. దాని ప్రభావం జనాల మీద పడి వారు కూడా అంత హాపీగా లేరు అని అంటున్నారు.
లేకపోతే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో ఎనిమిది సీట్ల కంటే ఎక్కువే సాధించేది అని అంటున్నారు కనీసంగా పది సీట్లు రావాల్సిన చోట చేసింది చెప్పుకోక పోవడం వల్లనే ఇలా జరుగుతోంది అని అంటున్నారు. వర్తమాన రాజకీయాల్లో చేసింది చెప్పుకోవాలి. ప్రచారం చాలా ఉండాలి. ఎందుకంటే ఇపుడు ఎవరి జీవితం వారిది ఎవరి స్మార్ట్ ఫోన్ వారిది అన్నట్లుగా ఉంది
అందువల్ల వారి దాకా వెళ్లి విషయాన్ని చేరవేయకపోతే ఎంత చేసినా చేయనట్లే అనుకుంటారు. ఒకవేళ చేసినా కూడా ఇంకా తక్కువే అని భావిస్తారు. ఎప్పటికపుడు రాష్ట్ర పెద్ద ప్రజలకు తాము చేసింది ఫలానా పని అని చెప్పాలి. దాని కోసం ఎంత కష్టపడింది తెలియచేయాలి. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఎలా అమలు చేస్తోంది కూడా సవివరంగా తెలియచెప్పాలి. లేకపోతే ఈజీగా వచ్చిందని అనుకుని ఈజీగా జనాలు మరచిపోతారు.
ఉచిత బస్సు ప్రయాణం తీసుకుంటే దానికి ప్రభుత్వం ఎంత డబ్బు తిరిగి ఆర్టీసీకి కడుతోందో ప్రభుత్వం జనాలకు చెప్పాలి. ప్రతీ సామాన్యుడు పర్సు నుంచి నెలకు రెండు వేల రూపాయలు బస్సు పాస్ లకు ఖర్చు కానీయకుండా చేసే క్రమంలో ప్రభుత్వం ఎంత భరిస్తోంది అన్నది చెబితేనే జనాలు అర్థం చేసుకుంటారు. లేకపోతే వారు ఏముందిలే అనుకుంటారు.
ఏపీ విషయానికే వస్తే పధకాలు ఎన్నో చేశామని అభివృద్ధి చేశామని వైసీపీ నేతలు ఇపుడు వల్లె వేస్తున్నారు. అదే వారు జనంలోకి వెళ్ళి చెప్పలేకపోవడం వల్లనే ఘోర ఓటమి ఎదురైంది అని అంటున్నారు ఈ ప్రభుత్వం అయిదేళ్ళూ ఏమీ చేయలేదు అని జనాలు అనుకోబట్టే 11 సీట్లు ఇచ్చారని అంటున్నారు. సో జగన్ చేసిన తప్పు రేవంత్ చేయకూడదంటే ఏపీని కేస్ స్టడీగా తీసుకోవాల్సిందే అని అంటున్నారు.