కీల‌క మ‌లుపు.. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌కు నోటీసులు!

ఓటుకు నోటు.. కేసు కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు తాజాగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది

Update: 2024-02-09 16:53 GMT

ఓటుకు నోటు.. కేసు కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు తాజాగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 2016 నాటి కేసు.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. అనేక కార‌ణాల‌తో ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు మార్చాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి సుప్రీంలో ట్రాన్స్‌ఫర్ పిటిషన్ దాఖలు చేశారు.

మాజీ మంత్రి దాఖ‌లు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మోహతా బెంచ్ విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వం, ఇతర ప్రతివాదులకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. నోటీసులకు నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని స్ప‌ష్టం చేసింది. కాగా, ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కిన రేవంత్ కు కేవ‌లం 60 రోజుల్లోనే ఇలా నోటీసులు రావ‌డంతో రాజ‌కీయంగా ఈ కేసుపై మ‌రోసారి చ‌ర్చ ప్రారంభమైంది.

సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులకు రేవంత్ ప్రభుత్వం ఎలాస్పందిస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది. ప్రస్తు తం హోంశాఖ కూడా రేవంత్ దగ్గరే ఉంది. త్వరలో ఓటుకు నోటు కేసుపై ట్రయల్ కూడా మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీఎం, హోంమంత్రిగా రేవంత్ ఉండటంతో ఈ కేసులో విచారణపై ప్రభావం చూపే అవకాశముందని సుప్రీం దృష్టికి జగదీష్ రెడ్డి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. విచారణపై ప్రభావం చూపిస్తే తాము చూస్తూ ఎలా ఉంటామని వ్యాఖ్యానించిం ది.

మ‌రో కేసు..

సీఎం రేవంత్‌పై జ‌గ‌దీష్ రెడ్డి మ‌రో కేసు పెట్టారు. బీఆర్ ఎస్ స‌ర్కారుకు అనుకూలంగా ప‌నిచేసిన పోలీసు అధికారుల‌ను నగ్నంగా పరేడ్ చేయిస్తాన‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో రేవంత్ వ్యాఖ్యానించార‌ని.. దీనిలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను కూడా సుప్రీం కోర్టుకు జగదీష్ రెడ్డి అందించారు. రేవంత్ సీఎంగా ఉండటంతో విచారణను ప్రభావితం చేసే అవకాశముందని, పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌కు కేసును బదిలీ చేయాలని కోరారు. ఈ నేప‌థ్యంలోనే సీఎం రేవంత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఓటు నోటు కేసు ఇదీ..

2015లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి ఓటు వేయాలంటూ నామినేటెడ్‌ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్‌కు రేవంత్ డబ్బులు ఆఫర్ చేశారనేది ప్ర‌ధాన అభియోగం. అప్పుడు రేవంత్ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. స్టీఫెన్‌సన్ ఇంటికెళ్లి రూ.50 లక్షలు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో కొన్ని రోజుల పాటు రేవంత్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చారు. ఈ కేసు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

Tags:    

Similar News