రేవంత్ మరో సూపర సిక్స్.. కేసీఆర్ కు మరింత ఇబ్బందేనట!

కారు సారుకు ఎంతో ఇష్టమైన ఆరును అదే పనిగా వాడేస్తున్న రేవంత్ దెబ్బకు.. ఇప్పుడు ఆరు మాట వింటేనే ఉలిక్కిపడేలా చేస్తున్నారు.

Update: 2024-07-06 05:30 GMT

‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అన్న రీతిలో గులాబీ బాస్ కేసీఆర్ గతంలో ఏ తీరును అనుసరించారో.. ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. అయితే.. ఈ ప్రయత్నంలో రేవంత్ అనురిస్తున్న కొన్ని అంశాలు ఆశ్చర్యానికి గురి చేసేలా ఉన్నాయి. సారు.. కారు.. ఆరు.. అంటూ గులాబీ నేతలు గొప్పలు చెప్పుకునే ఈ మూడు పాయింట్లకు.. కొత్త అర్థాన్ని చేతల్లో చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి. కారు సారుకు ఎంతో ఇష్టమైన ఆరును అదే పనిగా వాడేస్తున్న రేవంత్ దెబ్బకు.. ఇప్పుడు ఆరు మాట వింటేనే ఉలిక్కిపడేలా చేస్తున్నారు.

ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న రేవంత్.. రెండు రోజుల క్రితం ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలనున హస్తం గూటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మరో ‘ఆరు’కు రేవంత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తెర తీసిన ఈ సూపర్ సిక్స్ లో ఒకే దఫా ఆరుగురు ఎమ్మెల్యేల్ని పార్టీలోకి వచ్చేందుకు వీలుగా ఓకే చెప్పినట్లు సమాచారం. నిజానికి.. ఇద్దరో.. ముగ్గురో.. విడతల వారీగా పార్టీలో చేర్చుకోవచ్చు.

కానీ.. రేవంత్ మాత్రం పార్టీలో చేరే ఎమ్మెల్యేల సంఖ్య విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధతో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీలోకి వచ్చే వారంతా ఆరుగురు అయిన వెంటనే పార్టీలోకి చేర్చుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వరుస పరిణామాలతో కేసీఆర్ సారుకు ఆరు మీద విరక్తి వచ్చేయటం ఖాయమంటున్నారు. ఈసారి సూపర్ సిక్స్ కు ఉన్న మరో ప్రత్యేకత ఏమంటే.. హైదరాబాద్ మహానగర ఎమ్మెల్యేలు ఇద్దరు ఉంటారని చెబుతున్నారు. దీంతో.. హైదరాబాద్ నుంచి గెలుపొందిన అత్యధిక ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ గూటికి చేరినట్లు అవుతుందంటున్నారు. ఏమైనా.. కేసీఆర్ సారుకు లక్కీ నెంబరుగా ఉన్న ఆరుతోనే ఆయన్ను ఆగమాగం చేస్తున్న రేవంత్ తీరు సో స్పెషల్ గా చెప్పక తప్పదు.

Tags:    

Similar News