అక్బరుద్దీన్‌ను డిప్యూటీ సీఎం చేస్తా: సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై జరిగని చర్చలో పాల్గొన్న ఆయన.. బీఆర్ ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై జరిగని చర్చలో పాల్గొన్న ఆయన.. బీఆర్ ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ఉన్న మెట్రోను కీలకమైన హైదరాబాద్ పాతబస్తీ వరకు తీసుకురాలేక పోయిందని విమర్శించారు. కమీషన్ల కక్కుర్తితో పనులు ఆగిపోయాయని దుయ్యబట్టారు. కానీ, తమ ప్రభుత్వం పాతబస్తీ వరకు మెట్రోను పూర్తి చేయాలని.. ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి వెనుకడుగు ఉండబోదన్నారు.
అందుకే హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లను కేటాయించామని.. దీనికి అదనంగా ఎంతైనా సరే.. పాత బస్తీ వరకు మెట్రోను విస్తరించే ప్రాజెక్టును కూడా పూర్తి చేసినడిపిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది.. కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు. ఔటర్ రింగు రోడ్డు నుంచి పీవీ ఎక్స్‌ప్రెస్ వే వరకు ఎటు చూసినా.. తమ హయాంలో జరిగిన అభివృద్ధే కనిపిస్తుందన్నారు. నగరంలో మెట్రోకు శ్రీకారం చుట్టింది కూడా.. తమ పార్టీ గత ప్రభుత్వాలేనని చెప్పారు.
అలానే.. ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీ వరకు కూడా మెట్రోను విస్తరిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. పాత బస్తీకి మెట్రో రైల్లోనే వెళ్లి.. అక్కడి ప్రజలను కలిసి.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అభ్యర్థిస్తామని అన్నారు. ఒకవేళ అలా చేయకపోతే.. చంద్రాయణ గుట్ట ఎమ్మెల్యేగా ఉన్న అక్బరుద్దీన్‌ను కొడంగల్(సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం) నియోజకవర్గం నుంచి నిలబెడతామని చెప్పారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ బీఫాంపై ఆయనను పోటీ చేయించి.. గెలిపించుకుంటామని.. డిప్యూటీ సీఎంను కూడా చేస్తామని సంచలన వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓల్డ్ సిటీకి మెట్రోను తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందని సీఎం నిప్పులు చెరిగారు.
``అసెంబ్లీ వేదికగా చెబుతున్నా. మా ప్రభుత్వం గడువు ముగిసేలోగా ఓల్డ్ సిటీకి మెట్రో తెస్తాం. మెట్రో రైల్లోనే ప్రయాణించివచ్చి.. పాతబస్తీ ఓటర్లను కలుస్తాం. మాకు ఓటేయాలని కోరతాం. అలా జరగకపోతే.. వచ్చే ఎన్నికల్లో అక్బరుద్దీన్ ఒవైసీగారిని కాంగ్రెస్ తరఫున కొడంగల్ నుంచి పోటీ చేయిస్తాం. మా పార్టీ బీఫాం పైనే ఆయనను నిలబెట్టి గెలిపించుకుంటాం. ఆయనను ఉప ముఖ్యమంత్రిని కూడా చేస్తాం`` అని రేవంత్ తేల్చి చెప్పారు.