ఆ మూడింట్ లో రేవంత్ కు షాకులిచ్చేవి ఎన్ని?

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అత్యధికంగా పర్యటించిన నియోజకవర్గం మల్కాజిగిరి వస్తుంది. ఆ తర్వాతి స్థానాల్లో చేవెళ్ల.. మహబూబ్ నగర్ లు నిలుస్తాయి.

Update: 2024-05-12 05:28 GMT

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 17 ఎంపీ స్థానాల్లో సీఎం రేవంత్ రెడ్డి మూడు స్థానాల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. మిగిలిన పద్నాలుగు స్థానాలతో పోలిస్తే.. మూడు స్థానాలకు తన సమయాన్ని మాత్రమే కాదు తన బలగాన్ని ప్రత్యేకంగా మొహరించిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ మూడు స్థానాల్లో వచ్చే ఫలితం ఎలా ఉండనుంది? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకూ ఆ మూడు స్థానాలేంటి? అన్న విషయంలోకి వెళితే.. మొదటిది మల్కాజిగిరి. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి బరిలోకి దిగి విజయాన్ని సొంతం చేసుకున్న రేవంత్.. ఆ తర్వాత నుంచి ఎదగటమే తప్పించి తగ్గింది లేదు.

తాను పట్టు పట్టి పంతంగా ఫోకస్ చేసిన మరో స్థానం చేవెళ్ల. మూడోది తన సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్. ఈ మూడు స్థానాల్లో రేవంత్ ఎన్ని గెలిపించుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఈ మూడు స్థానాల్లో ఓటమి కూడా ఆయనకు ఇబ్బందికరంగా మారనుంది. దీంతో.. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ మూడు స్థానాలకు రేవంత్ ఎంత ప్రాధాన్యత ఇస్తారన్న విషయాన్ని ఆయన ఎన్నిసార్లు ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారన్నది చూస్తేనే అర్థమవుతుంది.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అత్యధికంగా పర్యటించిన నియోజకవర్గం మల్కాజిగిరి వస్తుంది. ఆ తర్వాతి స్థానాల్లో చేవెళ్ల.. మహబూబ్ నగర్ లు నిలుస్తాయి. మల్కాజిగిరిలో అత్యధికంగా తొమ్మిది సభల్ని నిర్వహించారు రేవంత్.ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో సొంతం చేసుకోవాలని భావిస్తున్నా.. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈటల రాజేందర్ కారణంగా ఫలితంపై ప్రభావం పడుతుందన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు.. ఈ ఎంపీ స్థానం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు ఒక్కస్థానం కూడా లేదు. దీంతో.. ఇక్కడి ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.

ముఖ్యమంత్రి స్వయంగా ఫోకస్ చేయటం.. గత ఎన్నికల్లో తాను విజయం సాధించిన స్థానంలో వచ్చే ఫలితం ఆయన మీద ప్రభావాన్ని చూపుతుంది. అందుకే.. ఆయన ఈ ఎన్నికల మీద ప్రత్యేక శ్రద్ధను ప్రదర్శించారు. తర్వాతి రెండు స్థానాలైన చేవెళ్ల.. మహబూబ్ నగర్ రెండు చోట్ల ఏడేసి చొప్పున సభల్ని నిర్వహించటం ద్వారా తన ప్రాధాన్యతను చెప్పకనే చెప్పేశారు.

ఎంపీ ఎన్నికల్లో భాగంగా రేవంత్ తెలంగాణ రాష్ట్రంలో53 సభల్లో పాల్గొంటే.. కేరళలో రెండు.. కర్ణాటకలో రెండేసి చోట్ల పాల్గొన్నారు. తెలంగాణలో ఆయన పాల్గొన్న 53 సభల్లో ఈ మూడు నియోజకవర్గాల పరిధిలోనే 22 సభల్లో పాల్గొనటం చూస్తే.. ఈ మూడింటి మీద ఎంత ప్రత్యేక శ్రద్ధ చూపారన్నది అర్థమవుతుంది. అయితే.. ఈ మూడు చోట్ల బీజేపీ అభ్యర్థులు బలంగా ఉండటం రేవంత్ కు ఇబ్బంది కలిగించే అంశంగా చెబుతున్నారు.

ఇప్పటివరకు ఉన్న అంచనాల్లో మల్కాజిగిరి రేవంత్ కు దిమ్మ తిరిగే షాకిస్తుందన్న మాట వినిపిస్తోంది. మిగిలిన రెండు చోట్ల పోటాపోటీ నెలకొందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. మూడింటి మీద ప్రత్యేక ఫోకస్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ కు ఎన్నికల ఫలితాలు కాసింత నిరాశను కలిగించే వీలుందంటున్నారు. అయితే.. శనివారం మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రకటన కొత్త ఆశల్ని తీసుకొస్తోంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు తాము మద్దతు పలుకుతున్నామని.. అందుకే ముస్లింలు కాంగ్రెస్ కు ఓటేయాలని ఆయన కోరారు. ఈ ప్రకటన కాంగ్రెస్ కు మేలు చేస్తుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో తేలాలంటే మాత్రం జూన్ 4 మధ్యాహ్నం వరకు వెయిట్ చేయక తప్పదు.

Tags:    

Similar News