హు.. హు.. హు.. ఆ కొత్త సీఎంను చలి పులి వణికిస్తున్నట్లుందే?

రాష్ట్రస్థాయిలో రాజకీయాల్లో అత్యున్నతమైనది ముఖ్యమంత్రి పదవి. సీఎం అంటే రాష్ట్రానికి అధిపతి.

Update: 2024-01-21 12:20 GMT

రాష్ట్రస్థాయిలో రాజకీయాల్లో అత్యున్నతమైనది ముఖ్యమంత్రి పదవి. సీఎం అంటే రాష్ట్రానికి అధిపతి. ఈ పదవి సాధించేందుకు కొందరు జీవితాలను ధారపోస్తుంటారు. రాజకీయ నాయకులు చాలామంది సీఎం పదవి అనేది జీవిత కాల స్వప్నం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలోకి వచ్చినప్పటి నుంచి సీఎం పదవి లక్ష్యంగా పెట్టుకున్న నాయకులు కొందరున్నారు. అలాంటివారిలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరైతే.. తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మరొకరు. గత నవంబరు చివర్లో జరిగిన ఎన్నికల్లో రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డిసెంబరు 7న ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

తొలి అధికారిక టూర్ లోనే సక్సెస్

సీఎం అయ్యాక మొదటి విదేశీ టూర్ ను దావోస్ కు చేపట్టారు రేవంత్. అయితే అది ఒక్క దేశం పర్యటనకు రాదు. దావోస్ లో ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులు జరుగుతుంటాయి. దీనికి వివిధ దేశాల ప్రతినిధులు హాజరవుతుంటారు. అక్కడికి వచ్చే కంపెనీల ప్రతినిధులకు తమ తమ దేశాలు, రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను వివరించి పెట్టుబడులు పెట్టేలా ఒప్పిస్తుంటారు. ఈ లెక్కన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతమైంది. ఒక్క రోజులోనే ఆయన రూ.30 వేల కోట్లపైగా పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నారు. అన్నీ కలిపి చూస్తే ఈ స్కోరు ఇంకా ఎక్కువే.

అబ్బో మహా రిచ్.. అటు చలిలోనూ..

ప్రతిసారి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులను దావోస్ లోనే నిర్వహిస్తుంటారు. అసలీ దావోస్ ఎక్కడ ఉందంటే.. స్విట్జర్లాండ్ లోని ఆల్ప్ పర్వతాల్లొ ఉండే దావోస్ ప్రస్తుత వాతావరణం -6 డిగ్రీలు. అంటే.. మనదగ్గర కంటే 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువని చెప్పకోవాలి. ఇలాంటిచోట జరిగే సద్సుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపరీతమైన చలి కారణంగా ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ఈ నెల 15 నుంచి 19 వరకు సాగింది. సదస్సు సందర్భంగా రేవంత్ మందపాటి చలి కోటు వేసుకుని కనిపించారు. పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకునే సమయంలోనూ ఆయన చలికోటు ధరించే కనిపించారు. ఇక స్విట్జర్లాండ్ నుంచి బ్రిటన్ వెళ్లిన రేవంత్ అక్కడ ప్రవాస తెలంగాణ ప్రజలతో సమావేశం అయ్యారు. అంతకుముందు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ పైనా అధికారులతో చర్చించారు. శనివారం లండన్ వీధుల్లో పర్యటించారు. ఈ సమయంలోనూ ఆయన మందపాటి జాకెట్ తోనే కనిపించారు. అయితే, స్విట్జర్లాండ్ లో కంటే ప్రస్తుతం లండన్ లో ఉష్ణోగ్రతలు ఫర్వాలేదు. అక్కడ 11 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంది.

కొసమెరుపు: లండన్ లో ప్రవాస తెలంగాణ ప్రజలతో జరిగిన సమావేశంలో రేవంత్ రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశిస్తూ పులి బయటకు వస్తే.. చెట్టుకు వేలాడదీస్తాం అని అన్నారు. అయితే, రాజకీయాల్లో పులి లాంటి కేసీఆర్ సీఎం రేవంత్ ను వణికించలేకపోయారు. కానీ, స్విట్జర్లాండ్ చలి పులి మాత్రం వణికించింది.

Tags:    

Similar News