వైఎస్ జగన్, కేసీఆర్ కు రేవంత్ ఆహ్వానం... ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు?

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న మధ్యాహ్నం 1:04 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

Update: 2023-12-06 09:49 GMT

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న మధ్యాహ్నం 1:04 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో రేవంత్‌ తో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ సమయంలో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి జారయయ్యే అథిదుల జాబితాలో కీలకమైన పేర్లు తెరపైకి వచ్చాయి.

అవును... ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కీలకనేతలకు ఆహ్వానాలు అందాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌ తో పాటు పలువురు ఏఐసీసీ సభ్యులు హాజరుకానున్నారు. ఈ సమయంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు కీలక నేతలు ముఖ్య అతిధులుగా హాజరవ్వనున్నారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ మొదటి, తాజా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తుంది. దీంతో... ఈ కార్యక్రమానికి ఈ ముగ్గురు నేతలూ హాజరవుతారా.. లేదా, అన్నది ఆసక్తిగా మారింది. కారణం... వైఎస్ జగన్ కేంద్రంలోని ఏ పార్టీ కూటములలోనూ లేకపోగా.. కేసీఆర్, చంద్రబాబులు కూడా అటు ఎన్డీయే కూటమిలో కానీ, ఇటు ఇండియా కూటమిలో కానీ లేకపోవడంతో ఈ సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది.

అయితే ఈ ఆహ్వానాల్లోని కీలక వ్యక్తుల్లో ఏపీలో టీడీపీ మిత్రపక్షం, బీజేపీలో బీజేపీ మిత్రపక్షం అయిన జనసేన అధినేత పవన్ ప్రస్థావన వినిపించకపోవడం గమనార్హం. అయితే పవన్ ను రేవంత్... చంద్రబాబు మిత్రుడిగా కాకుండా కాంగ్రెస్ శత్రువైన బీజేపీ మిత్రుడిగా చూస్తున్నారా అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఇదే సమయంలో ఈ క్రమంలో సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ నేతలు, ఇతర రాష్ట్రాల కీలక నేతలకు ఆహ్వానం పంపారు. ఇందులో భాగంగా... కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆ రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం పంపించారు. అదేవిధంగా... రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్, ఛతీస్‌ ఘడ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్ హాజరుకానున్నారు!

వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు వీరప్ప మెయిలీ, వాయిలార్ రవి, దిగ్విజయ్ సింగ్, చిదంబరం, కురియన్, కుంతియా, మీరాకుమారి, మాణిక్కం ఠాగూర్, సుశీల్ కుమార్ షిండే, మరికొందరు నేతలకు ఆహ్వానం పంపించారు. ఇండియా కూటమిలోని కీలక నేతల్లో ఒకరైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తోపాటు ఆ రాష్ట్రంలోని పలువురు నేతలకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తుంది.

ఇదే సమయంలో తెలంగాణ అమరుల కుటుంబాలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం పంపినట్లు తెలిసింది. ఇదే సమయంలో ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, కంచ ఐలయ్య, గాదె ఇన్నయ్యతోపాటు మరికొందరు ఉద్యమ కారులకు ఆహ్వానం పంపించినట్లు సమాచారం. వీరితోపాటు హైకోర్టు చీఫ్ జస్టిస్, పలువురు సినీ నటులు, వివిధ సంఘాల నేతలకు, మేధావులకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు