రేవంత్ వర్సెస్ అక్బరుద్దీన్.. అసలేం జరిగింది?

ఈ సందర్భంగా సీఎం రేవంత్ ను టార్గెట్ చేసిన అక్బరుద్దీన్ కు ఆయన అంతే ధీటుగా చురకలు అంటించారు.

Update: 2023-12-22 04:08 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చిన నిజాలకు మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీకి పొడుచుకొచ్చింది. మొన్నటివరకు తమకు అత్యంత మిత్రుడైన బీఆర్ఎస్ ప్రభుత్వమే రాజ్యమేలినప్పుడు తాను ప్రస్తావించిన సమస్యల గురించి ఏం చేశారన్న ప్రశ్న తలెత్తక మానదు. విద్యుత్ రంగంపై రేవంత్ సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రం మీద అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించిన నిజాలతో అక్బరుద్దీన్ కు కోపం వచ్చేసింది. అంతే.. ఆయన సమస్యల చిట్టా విప్పారు. అయితే.. రేవంత్ సర్కారు కొలువు తీరి పట్టుమని నెల కూడా కాలేదన్న సత్యాన్ని కన్వీనియంట్ గా మర్చిపోయారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ను టార్గెట్ చేసిన అక్బరుద్దీన్ కు ఆయన అంతే ధీటుగా చురకలు అంటించారు. ఉక్కిరి బిక్కిరి చేశారు. అసలేం జరిగిందంటే..

విద్యుత్ రంగంపై శ్వేతపత్రం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీలు చెల్లించని వాటిలో సిద్ధిపేట 61.37 శాతం ఉంటే.. గజ్వేల్ 50.29 శాతం ఉందని.. దక్షిణ హైదరాబాద్ (పాతబస్తీ) 43 శాతం ఉందంటూ మొదటి మూడు స్థానాల్లో ఉన్న బకాయిల గురించి ప్రస్తావించారు. బకాయిలు చెల్లించేలా హరీశ్ రావు.. కేసీఆర్.. అక్బరుద్దీన్ లు బాధ్యత తీసుకోవాలన్నారు. దీనికి కౌంటర్ గా మజ్లిస్ నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. విద్యుత్ విషయంలో పాతబస్తీ నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఒక్క వైరు కూడా మార్చలేదన్నారు. మరి.. పదేళ్లు కేసీఆర్ సర్కారు హయాంలో ఏం చేశామన్న విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు.

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్.. ‘‘విద్యుత్ విషయంలో పాతబస్తీ నిర్లక్ష్యానికి గురైందని ఎంఐఎం నేత మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టు మాత్రమే ఆయన చదువుతున్నారు. ఆ ప్రభుత్వ దుర్మార్గాలు ఆయనకు కనిపించటం లేదు. ఎంతసేపటికి పాతమిత్రుడిని కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నారు. ఆ పొగడ్తలు వినేందుకుమేం సిద్ధంగా లేం. ఇప్పటికే మీ మిత్రపక్షాన్ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. గత ప్రభుత్వంలో మజ్లిస్ భాగస్వామ్యం కాదా? మోడీకి మద్దతు ఇచ్చే వాళ్లకు అండగా నిలుస్తున్నారు. మీరు బీ టీంగా ఎందుకు ఉంటున్నారు?’’ అంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు.

దీనికి అక్బరుద్దీన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయగా.. నిలువరించిన రేవంత్.. ‘‘మైనార్టీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సిన పని లేదు. జూబ్లీహిల్స్ లో అజారుద్దీన్ కు కాంగ్రెస్ టికెట్ ఇస్తే మజ్లిస్ పోటీ చేసి.. మైనార్టీ ఓట్లు చీల్చి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేలా దోహదపడింది. షబ్బీర్ అలీ ఓటమికి కూడా ఆ పార్టీయే కారణం. సభలో 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు. వారిని అక్బురుద్దీన్ గౌరవించాలి. ఆయనకు కూడా కాంగ్రెస్ ప్రోటెం స్పీకర్ గా గౌరవం ఇచ్చింది. ఆయన మజ్లిస్ నాయకుడు మాత్రమే. ముస్లింలందరికీ ప్రతినిధి కారు. మాకు పాతబస్తీ.. కొత్త బస్తీ రెండూ సమానమే. ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది’’ అంటూ ఘాటుగా బదులిచ్చారు.

రేవంత్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విద్యుత్ రంగం ఎంతో డెవలప్ మెంట్ జరిగిందని.. పాతబస్తీలో ఇంకా 5 వేల స్తంభాలు.. కొత్త కండక్టర్లు.. ట్రాన్సఫార్మార్ల ఏర్పాటుకు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రస్తావించిన అంశాల్ని ప్రస్తావిస్తూ.. సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. షబ్బీర్ అలీ ఓటమికి తమ పార్టీకి ఏం సంబంధం ఉందని ప్రశ్నించిన అక్బరుద్దీన్.. జూబ్లీహిల్స్ లో మజ్లిస్ పార్టీకి కార్పొరేటర్లు ఉన్నారని.. పార్టీ బలంగా ఉండటంతో అభ్యర్థిని నిలిపినట్లుగా పేర్కొన్నారు మజ్లిస్ ఎవరికి బీ టీం కాదన్నారు. జూబ్లీహిల్స్ పోటీపై అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ మరోసారి స్పందిస్తూ.. 2014లో జూబ్లీహిల్స్ లో పోటీ చేసిన మజ్లిస్.. 2018లో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. మొత్తంగా అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు అంతే ధీటుగా రేవంత్ రియాక్టు కావటమే కాదు.. వారి తప్పుల్ని ఎత్తి చూపే విషయంలో పలు ఉదాహరణలతో సమాధానాలు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News