మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో.. రేవంత్ మాస్ సవాల్

అల్లాటప్పాగా రాలేదు. కార్యకర్తల కష్టంతో వచ్చాం. రాష్ట్రాన్ని దోచుకున్న మీకు ప్రజలు బుద్ది చెప్పారు. నువ్వు వస్తావా? మీ అయ్య వస్తాడా? మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డా" అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Update: 2024-02-28 04:45 GMT

గడిచిన కొద్దిరోజులుగా అదే పనిగా తనపై మాజీ మంత్రి కేటీఆర్ చేస్తున్న ఘాటు విమర్శలకు వడ్డీతో సహా చెల్లించేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరికొద్ది రోజుల్లో వస్తున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కేటీఆర్ కు మాస్ సవాలు విసిరారు ముఖ్యమంత్రి. 'నువ్వు మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో' అంటూ భారీ సవాలు విసిరారు. తాము ఎప్పుడు పోతామా అని ఎదురుచూస్తున్నారన్న రేవంత్.. "నువ్వే కాదు.. మీ అయ్య కూడా ఈ కుర్చీని తాకలేడు. అల్లాటప్పాగా రాలేదు. కార్యకర్తల కష్టంతో వచ్చాం. రాష్ట్రాన్ని దోచుకున్న మీకు ప్రజలు బుద్ది చెప్పారు. నువ్వు వస్తావా? మీ అయ్య వస్తాడా? మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డా" అంటూ వార్నింగ్ ఇచ్చారు.

చేవెళ్లలో నిర్వహించిన జనజాతర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "బీఆర్ఎస్ నేతలు పొద్దున లేస్తే చెత్తవాగుడు వాగుతూ.. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా? మేమెప్పుడూ కూర్చుంటామా? అని ఆలోచిస్తున్నారు. ఒకరేమో ఈ ప్రభుత్వం మూడు నెలలు ఉండదంటే.. మరొకరు ఆరు నెలలు ఉండదంటారు. ఆ సన్నాసులకు చెప్పదలుచుకున్నా. ఎవడైనా ఈ ప్రభుత్వం ఉండదని మాట్లాడితే మా కార్యకర్తలు పట్టుకొని చెట్టుకు కట్టేసి కొడతారు" అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.

ఎన్నికల ముందు రేవంత్ ను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించి ఉంటే మూడు స్థానాలు కూడా వచ్చేవి కావన్న మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు భారీ కౌంటర్ ఇచ్చారు రేవంత్. "ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి అని చెబితే కాంగ్రెస్ కు మూడు సీట్లు కూడా వచ్చేవి కావని ఓ సన్నాసోడు అంటున్నాడు. కేటీఆర్ కు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి సవాల్ విసురుతున్నా. ఈ రోజు నేను సీఎం.. నేనే పీసీసీ అధ్యక్షుడిని. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నీకు చేతనైతే.. దమ్ముంటే.. నువ్వు మగాడివైతే నీ పార్టీకి ఒక్క సీటు గెలిపించి చూపించు. మేం అల్లాటప్పా గాళ్లం కాదు. అయ్యని అడ్డుపెట్టుకొని కుర్చీ తీసుకోలేదు జెండాలు మోసి.. అక్రమ కేసులు ఎదుర్కొని.. చర్లపల్లి జైల్లో మగ్గినా భయపడకుండా.. లొంగకుండా నిన్ను.. నీ అయ్యను.. నీ బావను బొంద పెట్టి ఈ కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చిందో.. అయ్య పేరుతో వచ్చిందో కాదు. నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ నీలాంటి వాళ్ల నెత్తి మీద కాళ్లు పెట్టి మా కార్యకర్తలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఇది మా కార్యకర్తల త్యాగం.. పోరాటాల ద్వారా వచ్చింది. వారు మమ్మల్ని భుజాల మీద మోసినంత కాలం నువ్వు.. నీ అయ్య మాత్రమే కాదు.. వాళ్ల దేవుడు కూడా ఈ కుర్చీని తాకలేరు" అంటూ నిప్పులు చెరిగారు.

తాము సోషల్ మీడియా ఉంటే గెలిచేవాళ్లమని కేటీఆర్ అంటున్నాడని.. ఉన్న టీవీలన్నీ మీ చుట్టపోళ్లవే కదా? మాకేమైనా టీవీ ఉందా? పేపర్ ఉందా? సాయంత్రం సేద తీరటానికి జూబ్లీహిల్స్ లో సినిమా వాళ్ల గెస్ట్ హౌస్ లు ఉన్నాయా? అంటూ ఫైర్ అయ్యారు. కార్యకర్తలు కష్టపడి నిలబడి పోరాడితే తమకు ఈ అధికారం వచ్చిందన్న సీఎం రేవంత్.. "మీరు చేసే తప్పుడు పనులను మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఏ ట్యూబ్ అవసరం లేదు. చివరకు దివాళా తీసి యూట్యూబ్ చానల్ పెట్టుకుంటామంటున్నాడు. అలాగే క్రిష్ణానగర్ లో బ్రోకర్ దందా కూడా పెట్టుకో. రెండు కలిస్తే బాగా నడుస్తాయి. తెలంగాణను దోచుకుంటే ప్రజలు చెప్పుతో కొట్టారన్న విషయం ఇప్పటికి వారికి అర్థం కావట్లేదు. మీరు పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకు తింటే.. ప్రజలు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు" అని మండిపడ్డారు. మొత్తంగా తనపై ఇటీవల కాలంలో కేటీఆర్ చేస్తున్న విమర్శలకు రెట్టింపు స్థాయిలో ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారని చెప్పాలి.

Tags:    

Similar News