కేసీఆర్ మరో సంచలన నిర్ణయం.. ఆ అధికారులు ఇక కనిపించరా?
వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికలు సిద్ధమవుతున్నారు సీఎం కేసీఆర్
వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికలు సిద్ధమవుతున్నారు సీఎం కేసీఆర్. ఈ క్రమంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునేందుకూ వెనుకాడడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ విభాగాల్లో ఆయన కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలనే రద్దు చేశారు. ఇప్పుడు ఇదే దిశగా కీలకమైన రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో) వ్యవస్థను కూడా రద్దు చేసేందుకు కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారని టాక్.
వీఆర్వో, వీఆర్ఏలను రద్దు చేసిన తర్వాత ఆర్డీవో అధికారాలను కుదించారు. మరోవైపు ధరణి వచ్చిన తర్వాత ఆర్డీవోల ప్రాధాన్యత తగ్గిపోతోంది. ఇప్పుడు మొత్తానికి ఆర్డీవో అనే అధికారులే లేకుండా చేసేందుకు కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారని సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా 74 రెవెన్యూ డివిజన్లున్నాయి. సుమారు 90 మంది వరకు ఆర్డీవోలు పని చేస్తున్నారు. మరోవైపు ఇటీవల కొంతమంది ఆర్డీవోలకు పదోన్నతులు దక్కాయి.
ఇప్పుడు ఈ ఆర్డీవో వ్యవస్థను రద్దు చేసి.. ఈ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పజెప్పాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. తాజాగా శాసన మండలిలో మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్లు ఉన్నారని, ఇకపై వీళ్ల పర్యవేక్షణ బాధ్యతలను ఆర్డీవోలకు అప్పగించనున్నట్లు హరీష్ పేర్కొన్నారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వం త్వరలోనే ఆర్డీవోలను ఏరియా ఆసుపత్రుల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా అదనపు బాధ్యతలు అప్పగించనున్నట్లు ఓ స్పష్టత వచ్చింది. అయితే అదనపు బాధ్యతలు అప్పగించే బదులు పూర్తిగా ఆర్డీవో వ్యవస్థనే రద్దు చేసే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.