ప్రధాని.. వారంలో 36 గంటలు ఉపవాసం.. అందుకేనా?

పర్వదినాల్లో, విశేష తిథుల్లో, ముఖ్యమైన సందర్భాల్లో చాలామంది ఉపవాసం ఉంటారనే విషయం తెలిసిందే.

Update: 2024-02-01 09:30 GMT

పర్వదినాల్లో, విశేష తిథుల్లో, ముఖ్యమైన సందర్భాల్లో చాలామంది ఉపవాసం ఉంటారనే విషయం తెలిసిందే. కొందరు రోజు మొత్తం ఉపవాసం చేస్తే, మరికొంతమంది ఒంటి పూట ఉపవాసం చేస్తారు. అయితే ఇందుకు భిన్నంగా బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ మాత్రం వారానికి 36 గంటలు ఉపవాసంలోనే ఉంటున్నారు.

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ హిందూ మతస్తుడనే విషయం తెలిసిందే. ఆయన కుటుంబం వివిధ పండుగలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటుంది. ఆయన సతీమణి స్వయంగా ఇన్ఫోసిస్‌ అధినేత నారాయణమూర్తి కుమార్తె కావడం గమనార్హం.

రిషి సునాక్‌ తన ఉపవాసంలో భాగంగా ప్రతి వారంలో ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి మంగళవారం ఉదయం 5 గంటల వరకు ఏమీ తినకుండా కఠోర ఉపవాసం చేస్తున్నారు. ఈ ఉపవాస సమయంలో సునాక్‌ కేవలం నీళ్లు, టీ లేదా బ్లాక్‌ కాఫీ మాత్రమే తీసుకుంటున్నారు. ఈ విషయాలను స్వయంగా బ్రిటన్‌ మీడియాకు ప్రధాని రిషి సునాకే వెల్లడించారు.

‘సమతుల్య జీవనశైలి’లో భాగంగానే ఈ నియమాన్ని పాటిస్తున్నట్లు రిషి సునాక్‌ తెలిపారు. అందుకోసమే తాను ఉపవాస దీక్ష చేపట్టినట్టు వివరించారు.

ఉపవాసాన్ని ఒక్కో వ్యక్తి ఒక్కో రీతిలో చేస్తారని రిషి సునాక్‌ తెలిపారు. ఉపవాస సమయాలు కాకుండా మిగతా రోజుల్లో తనకు ఇష్టమైన తియ్యటి ఆహారా పదార్థాలను తీసుకుంటానని ఆయన తన ఆహార రహస్యాలను వివరించారు. తాను ఫుడ్‌ లవర్‌ నని ఆయన వెల్లడించారు.

పదవీ బాధ్యతల దృష్ట్యా గతంలో మాదిరిగా తనకు సమయం చిక్కడం లేదన్నారు. దీంతో వ్యాయామం చేయలేకపోతున్నానని వాపోయారు. అందుకే వారం ప్రారంభంలో సమతుల్య జీవన శైలిలో భాగంగా ఉపవాసానికి శ్రీకారం చుట్టానని తెలిపారు.

మరోవైపు రిషి సునాక్‌ ఉపవాసంపై ఆయన సన్నిహితులు కూడా స్పందించారు. 36 గంటలపాటు ఏమీ తినకుండా ఉండగలగటం గొప్ప విషయమన్నారు. ఉపవాసంలో ఉన్నప్పటికీ రిషి సునాక్‌ అధికారిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. వృత్తి, వ్యక్తిగత జీవితంలో అన్ని కోణాల్లో రిషి సునాక్‌ ఏకాగ్రత, క్రమశిక్షణకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.




 


Tags:    

Similar News