రుషి సునాక్ కీలక నిర్ణయం... "రువాండా" బిల్‌ కు బ్రిటన్ ఆమోదం!

ఈ నేపథ్యంలో.. ఈ బిల్లును తెరపైకి తేవడాన్ని సమర్థించుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌... అక్రమ వలసదారులను ఆఫ్రికా దేశానికి తరలించేందుకు ఏదీ అడ్డు కాదని స్పష్టం చేశారు.

Update: 2024-04-24 05:10 GMT

అభివృద్ధి చెందిన దేశాలకు ఉన్న పలు సమస్యల్లో అక్రమ వలసలు కూడా అతిపెద్ద సమస్య అనే చెప్పాలి. ఈ విషయాలు చాలా దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో బ్రిటన్ కు కూడా ఈ అక్రమ వలసలు అతిపెద్ద సమస్యగానే ఉందని చెప్పాలి. ఇది రోజు రోజుకూ తీవ్రమవుతుండటంతో... బ్రిటన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. వివాదాస్పద "రువాండా" బిల్లును తెరపైకి వచ్చింది.

అవును... అక్రమ వలసలతో సతమతమవుతోన్న బ్రిటన్‌.. వీటికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... వివాదాస్పద "రువాండా బిల్లు"కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో.. ఈ బిల్లును తెరపైకి తేవడాన్ని సమర్థించుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌... అక్రమ వలసదారులను ఆఫ్రికా దేశానికి తరలించేందుకు ఏదీ అడ్డు కాదని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో తాజాగా బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపిన రువాండ బిల్లు.. అంతర్జాతీయ వలసల నిర్వహణలో ఓ మైలురాయని తెలిపారు. బ్రిటన్‌ రాజు చార్లెస్‌ - 3 ఆమోదం తర్వాత ఇది చట్టరూపం దాల్చనుందని వెల్లడించారు! ఫలితంగా... వలసదారులను దోపిడీకి గురిచేసే క్రిమినల్‌ గ్యాంగ్‌ ల కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని.. దేశంలోకి ఇకనుంచి చట్టవిరుద్ధంగా ప్రవేశించినవారు ఇక్కడ ఉండేందుకు తాజా చట్టం అంగీకరించదని స్పష్టం చేశారు.

అసలు ఏమిటీ రువాండ బిల్లు..?

బ్రిటన్‌ లోకి అక్రమ వలసలు పెరుగుతున్నట్లు అక్కడ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇందులో భాగంగా... 2022లో సుమారు 45 వేల మంది బ్రిటన్ లోకి అక్రమంగా వచ్చినట్లు చెబుతున్నారు! ఈ సమయంలో ఇలా అక్రమంగా బ్రిటన్ లో ప్రవేశించేవారిని.. అక్కడ ఉండనివ్వరు.. అలా అని వారి వారి దేశాలకూ తిరిగి పంపరు!!

తాజాగా ఆమోదించబడిన ఈ బిల్లు ప్రకారం... బ్రిటన్ కు అక్రమంగా వచ్చేవారిని 6,400 కి.మీ. దూరంలో రువాండాకు తరలిస్తారు. అక్కడ రాజధాని కిగాలిలో ఏర్పాటుచేసిన శరణార్థి శిబిరాల్లో ఉంచుతారు. దీనికోసం ఏప్రిల్‌ 2022లోనే బ్రిటన్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇలా తరలించబడినవారికి మౌలిక వసతులు ఏర్పాటుచేసేందుకు ఆ దేశానికి ఇప్పటివరకు 290 మిలియన్ల పౌండ్లను చెల్లించింది.

ఈ క్రమంలో... అక్రమ వలసదారులను తరలించేందుకు ఛార్టర్‌ విమానాలు సిద్ధంగా ఉన్నాయని.. అక్కడ ఇప్పటికే 2,220 మంది వలసదారులు ఉండేందుకు వీలుగా శిబిరాలను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. అయితే... అక్కడే బ్రిటన్‌ లో ఆశ్రయం కోరుకునే వారి దరఖాస్తులను పరిశీలిస్తారు.

ఒక్కమాటలో చెప్పాలంటే... ఎన్టీఆర్ నటించిన సూపర్ డూపర్ సినిమా "ఆది"లో... ఆ ప్రాంతంలో అల్లర్లు సృష్టిస్తూ, రౌడీ యిజం చేసే వారిని హీరో బ్యాచ్ పార్సిల్ చేసి "అస్సాం" వెళ్లే ట్రైన్ లో వేసి పంపించేస్తుంటుంది. అదేవిధంగా... ఎవరైనా బ్రిటన్ లోకి అక్రమంగా ప్రవేశిస్తే... వారిని ఫ్లైట్ ఎక్కించి ఆఫ్రికా దేశమైన రువాండకు పంపించేస్తుందన్నమాట!

ఈ వివాదాస్పద బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో... బ్రిటన్‌ విపక్షాల నుంచి తీవ్ర నిరసన.. ఐక్యరాజ్యసమితి నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఆశ్రయం కోరుకునేవారిని రువాండా తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను బ్రిటన్‌ పునఃపరిశీలించాలని సూచిస్తూ.. ఇలా చేయడం చట్టవిరుద్ధమని చెబుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని హెచ్చరించింది.

Tags:    

Similar News