డిప్యూటీ సీఎంకు బాంబు బెదిరింపు.. ఉరుకులు పరుగులు తీసిన పోలీసులు!
తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ శిండే టార్గెట్ గా బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది.
దేశంలో బాంబు బెదిరింపులు పెరిగిపోతున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు, విమానాశ్రయాలు.. ఇలా రద్దీ ఉండే ప్రదేశాల్లో బాంబులు పెట్టామంటూ ఆగంతకులు తరచూ ఫోన్ చేసి బెదిరిస్తున్న ఉదంతాలను వింటూనే ఉన్నాం. ఇలా అజ్ఞాత వ్యక్తుల నుంచి వస్తున్న కాల్స్ నిజం కాకపోయినప్పటికీ ప్రతి కాల్ ను ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంటుంది. ఏ పుట్టలో ఏ పాము ఉందన్న చందంగా ప్రతి బెదిరింపు కాల్ ను సీరియస్ గా తీసుకుని తనిఖీలు చేయిస్తోంది. దీంతో బ్లాక్ మెయిలర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ శిండే టార్గెట్ గా బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది.
ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటకు వెళ్లిన సమయంలో బాంబు బెదిరింపులు చేసిన ఆగంతులకు.. తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శిందే ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేస్తామంటూ బెదిరింపు మెయిల్ చేశారు. అసలే అండర్ వరల్డ్ డాన్స్ ఎక్కువగా ఉండే ముంబై నగరంలో ఇలాంటి మెయిల్ రావడంతో పోలీసులు ఒక్కసారిగా అలర్డ్ అయ్యారు. ఆ బెదిరింపు మెయిల్ ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది? ఎవరు మెయిల్ పంపారు అన్న విషయంపై కూపీ లాగుతున్నారు.
మహారాష్ట్ర పోలీసుల కథనం ప్రకారం గోరేగావ్, మంత్రాలయ, జేజే మార్గ్ పోలీసు స్టేషన్లకు ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ మెయిల్ వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ శిండే సెక్యూరిటీని అలర్ట్ చేయడంతోపాటు ఆయన భద్రతను పెంచారు. మరోవైపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై ఆరా తీశారు. అన్నీ ఫేక్ అంటూ తేల్చారు. ఇటీవల కాలంలో ముంబైలో మాఫియా జోరు పెరిగిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఇంటిపై కాల్పులతోపాటు ఆయన సన్నిహితుడు మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని కాల్చి చంపారు. ఈ పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం టార్గెట్ గా వచ్చిన మెయిల్ పై పోలీసులు హై అలర్డ్ అయ్యారు.