ఎవరా ముగ్గురు? కూటమి తాంబూలం కోసం వెయిటింగ్!
అయితే.. రాజకీయ జంపింగుల కారణంగా.. ఇప్పుడు ఉప పోరు వచ్చింది. వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్లిన బీసీ నాయకులు ఆర్. కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావులు
ఏపీలో మూడు రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికలకు నగారా మోగింది. ఈ మూడు స్థానాలు కూడా ప్రతిపక్ష వైసీపీకి చెందినవే కావడం గమనార్హం. వాస్తవానికి ఇప్పటికిప్పుడు ఏపీలో రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. అయితే.. రాజకీయ జంపింగుల కారణంగా.. ఇప్పుడు ఉప పోరు వచ్చింది. వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్లిన బీసీ నాయకులు ఆర్. కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావులు.. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీకి రాం.. రాం చెప్పారు. ఈ క్రమంలోనే మూడు పదవులు ఖాళీ అయ్యాయి.
అయితే.. ఇప్పుడు ఈ మూడు స్థానాలను ఎవరికి ఇవ్వనున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రస్తుతం కూటమి పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దరిమిలా.. ఈ మూడు పదవులను సమానంగా పంచుకుని తమ తమ నేతలను పెద్దల సభకు పంపించే అవకాశం ఉంది. కానీ, ఇలా జరగకపోవచ్చని మరో చర్చ. మూడు పదవులు దక్కడమైతే.. కూటమికే దక్కుతాయి. మెజారిటీ ఎమ్మెల్యేల సంఖ్య కూటమి పార్టీలకే ఉండడం, వైసీపీకి 11 స్థానాలు మాత్రమే ఉండడంతో ఈ మూడు పదవులు ఖచ్చితంగా కూటమికే దక్కుతాయి. దీంతో నేతల ఎంపిక ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
వైసీపీకి, రాజ్యసభ స్థానాలకు కూడా ఏకకాలంలో రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావులు.. టీడీపీ గూటికి చేరి సైకిలెక్కారు. సో.. వీరిద్దరికీ మళ్లీ అవే పదవులు ఇస్తారా? అంటే సందేహమే. వ్యాపార వర్గాల్లో మంచి పలుకుబడి ఉన్న మస్తాన్ రావుకు దక్కినా.. మోపిదేవి రాజ్యసభకు వెళ్లడం ఇష్టపడడం లేదు. ఆయన మంత్రి పదవిని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాను వైసీపీ నుంచి బయటకు వచ్చినట్టు కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి రాజ్యసభ సీటుకు మోపిదేవి పోటీ కాకపోవచ్చు. అంటే ఒకటి ఖచ్చితంగా బీద మస్తాన్‌రావుకు దక్కనుంది.
ఇక, ఆర్. కృష్ణయ్య రాజ్యసభ స్థానాన్ని వదులుకున్నా.. ఆయన ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదు. తెలంగాణ టీడీపీలో చేరి.. అక్కడ పార్టీ బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా రాజ్యసభ సీటు ఇవ్వకపోవచ్చు. దీంతో మిగిలిన రెండు సీట్లను కొత్తవారికే కేటాయించే అవకాశం ఉంది. అయితే.. దీనిలో ఒకటిని.. టీడీపీ తరఫున, రెండోది జనసేన లేదా బీజేపీ తరఫున ఎంపిక చేసే అభ్యర్థికి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిలో జనసేన వైపు టీడీపీ అధినేత చంద్రబాబు మొగ్గు చూపుతారని సమాచారం. సో.. మొత్తంగా రాజ్యసభ తాంబూలాల్లో రెండు టీడీపీకి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకటి మాత్రమే బీజేపీ లేదా జనసేనకు దక్కనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.