రాజకీయ జోక్యంతో అస్తమించిన 'రవి' కిరణాలు!
హద్దు మీరితే.. అదుపు తప్పితే.. కనీసం పలకరించేవారు కాదు కదా.. పోనీలే పాపం అనిఅనుకునే వారు కూడా ఉండరు;

రాజకీయాలు మంచిదే. కానీ, వాటిని కొంత వరకు మాత్రమే వినియోగించుకోవాలి. హద్దు మీరితే.. అదుపు తప్పితే.. కనీసం పలకరించేవారు కాదు కదా.. పోనీలే పాపం అనిఅనుకునే వారు కూడా ఉండరు. ఇప్పుడు తమిళనాడు గవర్నర్ రాఘవేంద్ర నారాయణ రవి(ఆర్.ఎన్.రవి) వ్యవహారం ఇలానే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు అంటిన తలతో ఆయన సిగ్గు పడుతున్నారో లేదో తెలియదు కానీ.. దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థ అయితే.. సిగ్గు పడుతోంది.
గవర్నర్‌గా తన విహిత ధర్మాన్ని నెరవేర్చకుండా.. రాజకీయ ప్రాపు కోసం.. పెద్దల మెప్పు కోసం వేసిన అడుగులు.. రవినే కాదు.. గవర్నర్ వ్యవస్థనే కాదు.. ఏకంగా దేశంలో తొలిసారి సాక్షాత్తూ రాష్ట్రపతికి కూడా.. సుప్రీంకోర్టు లక్ష్మణ రేఖలు నిర్దేశించే పరిస్థితి వచ్చింది. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలకు ప్రాధాన్యం లేకుండా.. వ్యవహరించిన గవర్నర్‌గా ఆయన చరిత్రలో మరో పేజీ సృష్టించారు. `చిత్తు కాయితాలు` అంటూ నిండు సభలో చేసిన బిల్లులను ఆయన తృణీకరించిన తీరు నిజంగా సిగ్గుమాలిన తనమంటూ.. తమిళ పత్రికలు ఏనాడో ఘోషించాయి.
అయితే.. రవిమాత్రమేనా? అంటే.. కాదు. ఈ దేశంలో ఆది నుంచి కూడా గవర్నర్ వ్యవస్థ రాజకీయ సంక రంతో ఏనాడో భ్రష్టుపట్టింది. అయితే.. ఇక్కడ నాటికి నేటికి తేడా ఉంది. గతంలో రాజకీయ నేతలు నేరుగా గవర్నర్‌లు గా వచ్చేవారు. కాబట్టి.. తమ అనుకూల పార్టీకి కార్పెట్లు పరిచారంటే అర్థం ఉంది. కానీ, అలా కాకుండా.. ఐఏఎస్, ఐపీఎస్, న్యాయమూర్తులు గా ఏలుబడి సాగించిన వారు కూడా.. గవర్నర్‌లు గా మారాక.. కేంద్ర సర్కారు పార్టీకి అనుబంధం కార్యాలయంగా రాజ్‌భవన్‌లను మార్చేసిన తీరు.. నవ్విపోదురుగాక.. అన్నట్టుగా మారిపోయింది.
రవి గురించి చెప్పాల్సి వస్తే.. ఆయన ప్రొఫైల్ చిన్నదేమీ కాదు. ఘనతర నేపథ్యం.. పటుతర సారథ్యం ఉన్న ఉన్నతస్థాయి ఐపీఎస్ అధికారి. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో సహా సీబీఐలోనూ.. నిఖార్సయిన అధికా రిగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే నాగాలాండ్‌లో నాగాలతో ఒడంబడిక చేసుకుని.. విధ్వంసాల కు చెక్ పెట్టిన ఘన నేపథ్యం కూడా ఆయన సొంతం. అవినీతి, లంచాలు ఎరుగని ఉన్నతాధికారిగా ఆయన రికార్డులు చెబుతున్నాయి.
అలాంటి రవి.. గవర్నర్ గా నాగాలాండ్, మేఘాలయలో పనిచేసిన తర్వాత తమిళనాడుకువచ్చారు. అంతే.. ఆయనను బీజేపీ ఆవహించి.. ప్రజాస్వామ్య విలువలు, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం విలువలను కూడా ఆయన మరిచిపోయారు. సుప్రీంకోర్టు చివాట్లతో తల బొప్పికట్టి.. రాజ్‌భవన్ కు లోపల వైపు తాళాలు వేసుకుని కుమిలి పోతున్నారు.ప్రఖ్యాత రచయిత్రి రంగ నాయకమ్మ చెప్పినట్టు.. `జాతి ఛండాలుల కంటే.. జ్ఞాన ఛండాలులతోనే సమాజానికి చేటు` అన్న మాట ఇప్పుడు జోరుగా వినిపించేలా చేశారు.