ఈవినింగ్ 6 టు నైట్ 9... బీ కేర్ ఫుల్ గురూ!

అవును... దేశవ్యాప్తంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్యే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి

Update: 2023-12-17 12:30 GMT

తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌.సీ.ఆర్‌.బీ) వెల్లడించింది. రోజులోని 24గంటల్లోనూ ప్రధానంగా ఏయే సమయాల్లో ఎన్నేసి ప్రమాదాలు జరుగుతున్నాయి అనే వివరాలు బయటపెట్టింది. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు తాజా నివేదిక తెలిపింది.

అవును... దేశవ్యాప్తంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్యే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని తాజాగా నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌.సీ.ఆర్‌.బీ) వెల్లడించింది. ఇందులో భాగంగా ఆ మూడు గంటల్లోనే ప్రమాదాలు అత్యధికంగా నమోదవుతున్నట్లు ఎన్‌.సీ.ఆర్‌.బీ–2022 నివేదిక వెల్లడించింది.

ఇందులో భాగంగా 2022వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా 4,46,768 రోడ్డు ప్రమాదాలు నమోదుకాగా.. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల్లోనే అత్యధికంగా 90,663 ప్రమాదాలు జరిగినట్టు నివేదిక తెలిపింది. ఇదే సమయంలో మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య కూడా రెండో అత్యధిక నెంబర్ గా 77,514 ప్రమాదాలు నమోదయ్యాయి.

ప్రధానంగా 6 టు 9 ఎక్కువ ప్రమాదాలు జరగడానికి పలు కారణాలు తెరపైకి వస్తున్నాయి. ఆఫీసు పనివేళలు ముగించుకుని ఇళ్లకు వెళ్లేవారు, పలు రకాల పనులపై ఇంటి నుంచి బయటికి వచ్చే వాహనదారులతో రోడ్లు రద్దీగా ఉండటం... సాయంత్రం వేళల్లో సరైన వెలుతురు లేకపోవడం మొదలైన కారణాలతోనే ఈ మూడు గంటల మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు రోడ్డు భద్రత నిపుణులు చెబుతున్నారు.

ఈ సమయంలో దేశవ్యాప్తంగా ఏ సమయంలో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఇందులో భాగంగా... అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకూ 23,688 ప్రమాదాలు జరగగా.. తెల్లవారు జామున 3 గంటల నుంచి 6 గంటల మధ్య 25,680 ప్రమాదాలు జరిగాయని ఎన్.సీ.ఆర్.బి. తెలిపింది.

ఇక ఉదయం 6 టు 9 మధ్య 47,793... 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య 64,473... 12 నుంచి 3 గంటల మధ్య 66,756... మధ్యాహ్నం 3 - 6 మధ్య 77,514... సాయంత్రం 6 - రాత్రి 9 మధ్య 90,663... రాత్రి 9 టు అర్ధరాత్రి 12 వరకూ 50,201 ప్రమాదాలు సంభవించాయని ఎన్.సీ.ఆర్.బి.-2022 నివేదిక వెల్లడించింది. ఈ రకంగా గడిచిన ఏడాది మొత్తం 4,46,768 రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపింది.

Tags:    

Similar News