ఇదెక్కడి రోబో.. ఇదేం పాడు పని!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో సినిమా సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో సినిమా సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. అందులో సైంటిస్టు అయిన రజినీకాంత్ తనకులానే ఉండే ఒక రోబోను తయారుచేస్తాడు. ఆ రోబో హీరోయిన్ ఐశ్వర్యారాయ్ ను ప్రేమిస్తుంది.. ఆమెతో డ్యూయెట్లు పాడుతుంది. అచ్చం హృదయం ఉన్న మనిషిలానే ఆ రోబో ప్రవర్తిస్తుంది. ఆ తర్వాత ఆ రోబో విలన్ చేతిలో పడటం.. దాన్ని అతడు దుర్మార్గపు పనులకు వాడుకోవడం, చివరకు మనిషి తెలివితేటలను కూడా మించిపోయి ఆ రోబో ప్రవర్తించడం.. ఇదీ సినిమా.
ఇప్పుడు ఇలాగే గల్ఫ్ కంట్రీల్లో ఒకౖటెన సౌదీ అరేబియాలో మొదటి మగ రోబో ఒక పాడు పనికి దిగింది. ఆ పాడుపనితో తానొక ఉమనైజర్ ను అనే చర్చకు ఆ మగ రోబో కారణమైంది. సౌదీ అరేబియాలోని మొదటి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రోబోట్ ఒక మహిళా రిపోర్టర్ ను అనుచితంగా తాకింది.
మార్చి 4న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే సౌదీ అరేబియా రాజధాని నగరం రియాద్ లోని డీప్ ఫెస్ట్‌లో రోబోట్ ను ప్రదర్శించారు. ఆ మగ రోబో వద్ద నుంచుని ఒక మహిళా టీవీ రిపోర్టర్ దాని గురించి వివరిస్తుండగా ఆ రోబో అనుచిత ఘటనకు పాల్పడింది. ఆ మహిళా విలేకరి మాట్లాడుతుండగా ఆమె వెనుకే ఉన్న రోబో ఆమె పృష్ట (పిరుదులు) భాగాన్ని చేతితో నిమిరింది.
ఈ అనుకోని ఘటనతో ఆ మహిళా రిపోర్టర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత ఆ పని రోబో చేసిందని తెలుసుకుని బిత్తరపోయారు. ఆ రోబోట్ వైపు తిరిగిన మహిళా రిపోర్టర్ తన చేతిని పైకెత్తి ఇక ఆగు అన్నట్టు సీరియస్ గా చూశారు.
ఇప్పుడీ ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. చాలా మంది ఈ మగ రోబోకు 'కోడెడ్ టు బి ఎ క్రీప్', 'వుమనైజర్ రోబోట్', 'పర్వెట్ రోబోట్' అంటూ పేర్లు తగిలిస్తున్నారు. మరికొందరు ఆ రోబో సరిగా పనిచేయడం లేదని.. బ్యాకెండ్ డెవలపర్లు దాన్ని మరింత మెరుగ్గా పనిచేసేలా తీర్చిదిద్దాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఇప్పటికే ఏఐ టెక్నాలజీపైన ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దాంతో మంచి కంటే చెడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏఐని వీలైనంత తక్కువగా వినియోగించడమే మంచిదనే అభిప్రాయాలున్నాయి. టెక్నాలజీ మనిషి మేథస్సును దాటిపోయి పైచేయి సాధిస్తే జరగబోయే పరిణామాలు మనిషి ఊహకు కూడా అందవంటున్నారు. ఇప్పుడీ ఈ రోబో కూడా ఏఐ టెక్నాలజీతో రూపొందించిందే కావడం గమనార్హం.