రాష్ట్రాన్ని హిట్లర్, గడాఫీ కలిసి పాలిస్తున్నారంట!
ఈ సమయంలో వైసీపీ నేత రోజాతోపాటు పలువురు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో... పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీనిపై వైసీపీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వైసీపీ నేత రోజాతోపాటు పలువురు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఏపీలో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినవారిపై ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన మాజీమంత్రి రోజా... వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఐటీడీపీ నీచపు పోస్టులు పెట్టిందని అన్నారు. ఏపీలో తప్పు చేయనివారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
ఇదే సమయంలో... ఏపీని హిట్లర్, గడాఫీ కలిసి పాలిస్తున్నట్లుగా ఉందని అన్నారు. చంద్రబాబు తప్పు చేసి ఎదుటివారిపై రుద్దుతున్నారని.. వ్యక్తిత్వ హనానానికి పాల్పడుతున్నారని.. పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారని.. ఇక మీరెంత? అని రోజా ఫైర్ అయ్యారు!
ఈ సందర్భంగా... చంద్రబాబు, పవన్ పాలనలో అదృశ్యమైన మహిళల ఆచూకీ కోసం ఏమి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించిన రోజా... వైసీపీ హయాంలో వేల సంఖ్యలో మహిళలు మిస్ అయ్యారంటూ అబద్దపు ప్రచారం చేశారని, అయితే వారి సంఖ్య 36 మందే అని అసెంబ్లీ సాక్షిగా హోంమంత్రే వాస్తవాలు వెల్లడించారని అన్నారు.
ఇక.. రాష్ట్రంలో ఎవరికీ న్యాయం చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారని ఎద్దేవా చేసిన రోజా.. మహిళలపై నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారని అన్నారు. తాము ఫిర్యాదు చేస్తే రిసీవ్డ్ కాపీ ఇవ్వడానికి వందసార్లు పై అధికారులతో మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు!
ఇదే సమయంలో స్పందించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి... తాము ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు గంటల కొద్దీ నిలబెట్టి, ఫిర్యాదు తీసుకోవడానికి వెనకాడుతున్నారని.. తమకు ఉన్న ప్రోటోకాల్ ను విస్మరిస్తే కచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ వెస్తామని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. ప్రజా గొంతుకలను నొక్కే ప్రయత్నాన్ని విరమించుకోవాలని హితవు పలికారు.
మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతు... తాము ఐటీడీపీపై ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు కేసులు తీసుకోవడం లేదని అన్నారు. జుగుప్సాకరంగా ఐటీడీపీ పోస్టులు పెడుతున్నా చర్యలు లేవని.. ఏపీలో రాజ్యాంగ హక్కులు కాలరాశారని.. కేసుల పేరుతో వేధిస్తున్నారని.. కూటమి పార్టీలకు ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.