ఇదెక్కడి వింత.. రోజా ఓఎస్డీకే ఆ బాధ్యత!
గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం వరుసగా విచారణకు ఆదేశిస్తోంది.
గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం వరుసగా విచారణకు ఆదేశిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పర్యాటక, క్రీడల శాఖ మంత్రిగా ఆర్కే రోజా ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో పలు పర్యాటక ప్రాజెక్టులను కొందరు ప్రైవేటు వ్యక్తులకు అడ్డగోలుగా కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే విశాఖ రుషికొండలో రిసార్టులను, పర్యాటక కాటేజీలను కూల్చి కొత్తవి కట్టారు. ఈ సందర్భంగా అప్పటికే కాటేజీల్లో ఉన్న రూ.కోట్ల విలువైన మంచాలు, ఫర్నీచర్, ఏసీలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ తదితర వస్తువులను పర్యాటక శాఖ ఉన్నతాధికారులు మాయం చేశారనే ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ ఘటనలపై విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా రాజారాం మనోహర్ కు అధికారులు బాధ్యతలు అప్పగించారు. అయితే ఈయన నియామకంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజారాం మనోహర్.. ఆర్కే రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఆమె దగ్గర ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా పనిచేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తూ అప్పటి అధికారికే విచారణ బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం మారినా ఇంకా కొందరు ఉన్నతాధికారులు వైసీపీ భక్తితో తరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా వైసీపీ పట్ల తమ స్వామి భక్తిని చాటుకుంటున్న కొందరు ఉన్నతాధికారులు పర్యాటక శాఖలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు బయటకు రాకుండా తమ శక్తియుక్తులను వినియోగిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎలాంటి ఆరోపణలు, అవినీతి లేని నిజాయతీ కలిగిన అధికారికి విచారణ బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా వద్ద ఓఎస్డీగా పనిచేసిన రాజారాం మనోహర్ కు విచారణ అధికారిగా బాధ్యతలు ఎలా అప్పగిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రాజారాం మనోహర్.. రాష్ట్ర ఆడిట్ శాఖలో డిప్యూటీ డైరక్టర్ గా ఉండేవారు. ఆయనను ఆర్కే రోజా తన ఓఎస్డీగా నియమించుకున్నారు. ఎన్నికల ముందు వరకు ఆయన ఆమె వద్ద పనిచేశారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థలో కీలకమైన విజిలెన్స్, మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ గా రాజారాం పనిచేశారు. అలాంటి వ్యక్తికే ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని బాధ్యతలు అప్పగించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని ఉన్నతాధికారులు విచారణను తూతూమంత్రంగా ముగించి నీరుగార్చాలన్న ఉద్దేశంతో ఉన్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారం ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ దృష్టికి రావడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రి వద్ద ఓఎస్డీగా చేసిన వ్యక్తికి విచారణ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ఆయన అధికారులపై మండిపడినట్టు తెలిసింది. రాజారాం విచారణ ఎలా ఉన్నా.. మళ్లీ ఉన్నతాధికారుల కమిటీ కూడా సమాంతరంగా విచారణ చేయాలని మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశించారు.
విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ, సీఐడీ వంటి సంస్థలతో విచారణ చేయిస్తే గత ప్రభుత్వ హయాంలో పర్యాటక శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలు బయటకొస్తాయని అంటున్నారు.