ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మధ్య ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఆ రాష్ట్రంలో ఈ ఎన్నికలు ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. అయితే, వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మహిళా మంత్రి.. కీలకమైన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
అప్పుడు.. ఇప్పుడు విరోధమే
ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. రాజకీయంగా ఎంత చురుగ్గా ఉంటారో తెలిసిందే. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేస్తున్న పిఠాపురంలో జబర్దస్త్ నటుల ప్రచారంపై ఆమె చేసి వ్యాఖ్యలు సంచలనం రేపాయి. దీనికి అటువైపు నుంచి కూడా అంతే స్థాయిలో స్పందన వచ్చినది వేరే విషయం. ఇప్పుడు తాజాగా నగరిలో పోలింగ్ సరళిని పరిశీలిస్తూ రోజా విస్మయకర వ్యాఖ్యలు చేశారు. ఐదు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలను.. పోలింగ్ సందర్భంగానూ చేశారు. జగన్ ను ఓడించేందుకు విపక్ష నేతలు ఏకమైనట్లు ఏకమైనట్లు నగరిలో నన్ను ఓడించేందుకు సొంత పార్టీ వారే ఏకమయ్యారని ఆరోపించారు. ఇప్పుడు పోలింగ్ సమయంలోనూ పోలింగ్ కేంద్రం బయట మాట్లాడారు.
టీడీపీ వాళ్లు కాదు.. వైసీపీ వారితో సమస్య
నగరిలో తనకు టీడీపీ వారితో సమస్య లేదని.. మంత్రి రోజా అన్నారు. కేజే కుమార్ వర్గం విమానాశ్రయంలో జగన్ ను కలిసి.. ఆశీర్వాదాలు పొంది.. నియోజకవర్గంలో మాత్రం తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని రోజా ఆరోపించారు. టీడీపీకి ఓటేయమని కేజే కుమార్ వర్గం నేరుగానే ప్రజలను కోరుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పదవులు పొంది కూడా ఇలా చేయడం నీచం అని వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు కూడా తిరగడం లేదని.. కానీ, కేజే కుమార్ వర్గం మాత్రం వ్యతిరేకంగా పనిచేస్తోందని, సైకిల్ కు ఓటేయమని కోరుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.