ఒక్క పూటలోనే కోటి.. యూట్యూబ్ లో రొనాల్డో 'సూపర్ కిక్'

ఆ దేశం ఇంతవరకు ప్రపంచ కప్ సాధించి ఉండొచ్చు.. కానీ, అతడు మాత్రం ప్రపంచ కప్ గెలిచినదాని కంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు

Update: 2024-08-22 08:21 GMT

ఆ దేశం ఇంతవరకు ప్రపంచ కప్ సాధించి ఉండొచ్చు.. కానీ, అతడు మాత్రం ప్రపంచ కప్ గెలిచినదాని కంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. అతడి దేశం ప్రపంచ స్థాయి జట్టుగా ఎదిగి ఉండకపోవచ్చు.. అతడు మాత్రం ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు.. ఇక లీగ్ పోటీల్లో రారాజు.. వేల కోట్లు ధారపోసి కొనుక్కునే స్థాయి అతడిది. అలాంటివాడు సోషల్ మీడియాలోకి వస్తే ఇంకేమైనా ఉందా..? ఇప్పటికే ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, ‘ఎక్స్’ లలో దుమ్మురేపుతున్న అతడు ఇప్పుడు ఏకంగా యూ ట్యూబ్ లోకీ వచ్చేశాడు.. ఇంకేముంది... దుమ్మురేపుతున్నాడు.

గంటన్నరలో 10 లక్షల సబ్స్..

ఎవరైనా యూ ట్యూబ్ చానెల్ పెడితే ఎంతమంది సబ్ స్ర్కైబ్ చేసుకుంటారు..? ఓ పదివేలో.. ఇరవై వేలో..? ఫేమస్ అయినవారైతే.. ఓ యాభై వేలు.. ఇక లక్షల్లో సబ్స్ కావాలంటే దానికి కొన్ని రోజులు పడుతుంది. విపరీతమైన కష్టం చేయాల్సి ఉంటుంది. కానీ, అతడికి అదేమీ అవసరం లేకపోయింది. ఎందుకంటే.. అతడు క్రిస్టియానో రొనాల్డో కాబట్టి. ప్రపంచ ఫుట్ బాల్ లో ఆల్ టైమ్ గ్రేట్ లలో ఒకడైన రొనాల్డో.. 39 ఏళ్ల వయసులోనూ మైదానంలో చురుగ్గా కదులుతున్నాడు. కాగా, ఈ పోర్చగల్‌ కు స్టార్‌ ఫుట్‌బాల్ ప్లేయర్‌ సొంత యూ ట్యూబ్ ఛానల్‌ పెట్టాడు. దీంతో ఫ్యాన్స్‌ కు మరింతగా అందుబాటులోకి వచ్చాడు. అంతేకాదు.. తనకే సాధ్యమైన ఒక రికార్డును తన పేరిటనే లిఖించుకున్నాడు. రొనాల్డో యూ ట్యూబ్ చానల్ స్టార్ట్ చేసిన గంటన్నర (90 నిమిషాలు)లోనే మిలియన్‌ (10 లక్షలు) సబ్‌ స్క్రైబర్లను సాధించాడు. ఈ రికార్డు అందుకున్న తొలి వ్యక్తి అతడే. ఇక ప్రారంభించి పూట గడిచిందో లేదో.. సబ్ స్ర్కైబర్ల సంఖ్య కోటి (13 మిలియన్లు) దాటేసింది. అయితే, రొనాల్డో పోస్ట్ చేసింది మొత్తం 19 వీడియోలు మాత్రమే కావడం గమనార్హం.

మిగతా సోషల్ మీడియాలోనూ మొనగాడే

సోషల్ మీడియాలోని ఎక్స్ (ట్విటర్), ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో కూడా ఉన్న రొనాల్డో అక్కడ మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. ‘ఎక్స్‌’లో 112.5 మిలియన్లు (11కోట్ల మందిపైగా), ఫేస్‌ బుక్‌ లో 170 మిలియన్లు (17 కోట్లు), ఇన్‌ స్టాగ్రామ్‌ లో 636 మిలియన్లు (63.6 కోట్లు) ఫాలోవర్లు రొనాల్డోకు ఉన్నారు. ఇప్పుడు యూ ట్యూబ్ దుమ్మదులిపేందుకు సిద్ధమయ్యాడు. కొత్త చానల్ ప్రారంభం సందర్భంగా స్పందిస్తూ.. ‘వెయిటింగ్‌ ముగిసింది. ఇది నా యూట్యూబ్ ఛానల్‌. ప్లీజ్ సబ్‌ స్క్రైబ్‌.. కొత్త ప్రయాణంలో చేరండి’ అని క్యాషన్ పెట్టాడు.

కొసమెరుపు: రొనాల్డోకు ముగ్గురు పిల్లలు. తన యూట్యూబ్ చానెల్ గురించి వారికి వివరిస్తున్న వీడియోను ఫుట్ బాలర్ పోస్ట్ చేశాడు. అయితే, ఇందులో ముగ్గురు పిల్లలూ తమతమ సెల్ ఫోన్లలో మునిగిపోయారు. అంటే.. ఎంతటి గొప్ప ఫుట్ బాలర్ పిల్లలు అయినా ఫోన్ కు బానిసలే అని తెలుస్తోంది.

Tags:    

Similar News